Delta Plus Variant: కరోనా మహమ్మారి మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఒక వైపు సెకండ్‌వేవ్ విజృంభణ తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు డెల్టా ప్లస్ వేరియంట్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ రోజురోజుకు కొత్త రూపాంతరం చెందుతూ వ్యాపిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదు కాగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 52 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. థర్డ్‌వేవ్ ముప్పునకు ఈ రకమే కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడులో కూడా డెల్టా ప్లస్ వేరియంట్‌తో తొలి మరణం సంభవించింది. మధ్యప్రదేశ్‌లో కూడా రెండు మరణాలు సంభవించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా, డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. జమ్మూలోని అతిపెద్ద ధాన్యం మార్కెట్ మూతపడింది. జమ్మూలో తొలి కేసు నమోదు కావడంతో స్థానిక వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు వీకెండ్ లాక్‌డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకున్నాయి. జమ్మూతోపాటు ఎనిమిది జిల్లాల్లో వీకెండ్ లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఈనెల 20న ప్రకటించినప్పటికీ, డెల్టా ప్లస్ కేసుల వల్ల అప్రమత్తమయ్యారు అధికారులు. ఇందులో భాగంగా నెహ్రూ మార్కెట్, ఆసియా చౌక్, విక్రమ్ చౌక్‌లలో దుకాణాలన్నీ మూసివేశారు. రానున్న మూడు వారాల్లో వికెండ్ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
కరోనా వైరస్ సెకండ్‌వేవ్ అంత తీవ్రంగా థర్డ్‌వేవ్ ఉండదని ఐసీఎంఆర్ ఎపిడమాలజీ విభాగం చెబుతోంది. దేశంలో డెల్టా ప్లస్ కేసులు తక్కువగానే ఉన్నాయని, వీటితో థర్డ్‌వేవ్ ప్రారంభమయ్యే సూచనలు లేవని తెలిపారు. భారీ వ్యాక్సినేషన్, కోవిడ్ జాగ్రత్తలు పాటించడమే కరోనా దశలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వెల్టా ప్లస్ వేరియంట్‌పై టీకాల ఏ మేరకు ప్రభావం చూపుతాయనే విషయంలో పరిశోధన జరుగుతోందని తెలిపింది.
డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నాగ్‌పూర్ పురపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 28 నుంచి నగరంలో కొత్త ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. నగరంలో అన్ని దుకాణాలను సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంటాయని, ఆ తర్వాత మూసివేయాలని ఆదేశించింది. మాల్స్, థియేటర్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు మూసివేసి ఉంచాలని ఎన్‌ఎంసీ కమిషనర్ బి. రామకృష్ణన్ తెలిపారు. శని, ఆదివారాల్లో మాత్రం అత్యవసరం కాని దుకాణాలు మూసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.