
ఢిల్లీలోని గోవింద్ వల్లభ్ పంత్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఆసుపత్రిలో మలయాళ భాష వినియోగాన్ని నిషేధిస్తూ జారీ అయిన సర్క్యులర్ ను ఉపసంహరించారు. ఈ సర్క్యులర్ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కే.సి. వేణుగోపాల్, శశిథరూర్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో వివాదాస్పదమైన దీన్ని ఉపసంహరిస్తున్నట్టు ఈ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ విషయమై ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ ఈ ఆసుపత్రికి మెమో జారీ చేసింది. తమకు గానీ, ఢిల్లీ ప్రభుత్వానికి గానీ తెలియజేయకుండా హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఈ 1315 సర్క్యులర్ జారీ చేశారని హాస్పిటల్ అధికారులు తెలిపారు. (నర్సులు హిందీ లేదా ఇంగ్లీషు లోనే మాట్లాడాలని, మలయాళం చాలామంది రోగులకు అర్థం కాదని, ఈ హెచ్చరికను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సర్క్యులర్ లో పేర్కొన్నారు). అయితే దేశవ్యాప్తంగా గల ఆసుపత్రుల్లో కేరళ నుంచి వచ్చిన నర్సులే ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. ఈ సర్క్యులర్ పట్ల వివిధ నర్సింగ్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అటు మలయాళం కూడా భారతీయ భాషే అని, దీన్ని మాట్లాడవద్దని అనడం వివక్ష చూపడమే అవుతుందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మరో ఎంపీ కె.సి.వేణుగోపాల్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కి లేఖ రాస్తూ.. ఈ సర్క్యులర్ ని తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధ సర్క్యులర్ అన్నారు.
మరో నేత శశిథరూర్.. ఇది భారతీయుల మౌలిక మానవ హక్కులను అతిక్రమించడమే అవుతుందని, అసలు ఇది క్రూరమైన చర్య అని పేర్కొన్నారు. నర్సులను తమ మాతృ భాషలో మాట్లాడవద్దని అనడం ఏ మాత్రం సమ్మతం కాదన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏనుగు వింత చేష్టలు..నీరు త్రాగేందుకు కూడా సోమరితనాన్ని ప్రదర్శిస్తున్న గజరాజు..:Elephant Viral Video