ఢిల్లీ పోలీసు శాఖలోని ప్రత్యేక విభాగం శనివారం 350 కేజీల నిషిద్ధ హెరాయిన్ ని స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ 2,500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామని, వీరిలో ముగ్గురు హర్యానాకు, ఒకరు ఢిల్లీకి చెందినవారని వారు చెప్పారు. (అయితే వీరిలో ఓ ఆఫ్ఘన్ దేశీయుడు, ఒకడు జమ్మూ కాశ్మీర్ కు, మరొకడు పంజాబ్ కు చెందినవాడని మరికొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి). ఇంత భారీ ఎత్తున డ్రగ్ ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఓ ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ గుట్టును రట్టు చేశామని వారు వెల్లడించారు. ఇప్పటివరకు ఇంత పెద్ద డ్రగ్ రవాణాను పట్టుకోవడం ఇదే మొదటిసారన్నారు. ప్రస్తుతం నార్కో-టెర్రరిజం కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.కొన్ని నెలలుగా ఈ డ్రగ్ దందా సాగుతోందని, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ హెరాయిన్ మొదట ముంబైకి, ఆ తరువాత సముద్ర మార్గం ద్వారా సీక్రెట్ కంటెయినర్లలో ఢిల్లీకి చేరిందని స్పెషల్ సెల్ చీఫ్ నీరజ్ ఠాకూర్ తెలిపారు. మధ్యప్రదేశ్ లోని శివపురి దగ్గర గల ఓ ఫ్యాక్టరీ లో ఈ హెరాయిన్ ని మరింత శుద్ధి (ప్రాసెస్) చేస్తారని, దీన్ని రహస్యంగా దాచేందుకు ఫరీదాబాద్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారని ఆయన చెప్పారు.
పంజాబ్ కు సప్లయ్ చేసేందుకు ఈ డ్రగ్ ని ఉద్దేశించారని, దీని రవాణాకు అవసరమైన డబ్బు పాకిస్థాన్ నుంచి అందుతున్నట్టు భావిస్తున్నామని నీరజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో అసలైన సూత్రధారి ఉన్నాడని, ఈ సిండికేట్ అతని ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నట్టు తెలుస్తోందని ఆయన చెప్పారు. గతనెలలో కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 22 లక్షల నిషిద్ధ సైకోట్రోపిక్ టాబ్లెట్స్ ను, 245 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి : మాస్క్ లేదంటే బాదుతున్న బుడ్డోడు..! పట్టించుకోని పర్యాటకులు..వైరల్ అవుతున్న చిన్నారి వీడియో :Little Boy In Dharamshala Video.