Delhi Elections 2025: ఢిల్లీ ఎన్నికలు.. పోలింగ్, కౌంటింగ్ తేదీలు.. మరిన్ని కీలక వివరాలు..

| Edited By: TV9 Telugu

Jan 08, 2025 | 1:28 PM

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించి.. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది.

Delhi Elections 2025: ఢిల్లీ ఎన్నికలు.. పోలింగ్, కౌంటింగ్ తేదీలు.. మరిన్ని కీలక వివరాలు..
Follow us on

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు – 2025 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం (07 జనవరి 2025) నాడు విడుదల చేసింది. ఫిభ్రవరి 5వ తేదీన ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల (జనవరి) 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. జనవరి 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు గడువు విధించారు. ఈనెల 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్‌ వెంటనే అమల్లోకి వచ్చినట్టు ఈసీ ప్రకటించింది. కాగా ఈవీఎంలపై ఎలాంటి అనుమానలు అక్కర్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టంచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కోటి 55 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కీలక వివరాలు

  • ఢిల్లీ అసెంబ్లీ మొత్తం స్థానాలు: 70
  • పోలింగ్ తేదీ: 05 ఫిబ్రవరి
  • ఓట్ల లెక్కింపు: 08 ఫిబ్రవరి
  • నోటిఫికేషన్ విడుదల: 10 జనవరి
  • నామినేషన్ల దాఖలు గడువు: 17 జనవరి
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: 20 జనవరి
  • మొత్తం ఓటర్లు: 1.55 కోట్ల
  • పురుష ఓటర్లు: 83.49 లక్షలు
  • మహిళా ఓటర్లు: 71.74 లక్షలు
  • తొలిసారి ఓటర్లు: 1.08 లక్షలు
  • ఎస్సీ రిజర్వ్ స్థానాలు: 12
  • పోలింగ్ స్టేషన్లు: 13,033

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక వివరాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఒంటరిగా పోటీ చేస్తోంది. ఆప్‌, బీజేపీ , కాంగ్రెస్‌ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. నాలుగోసారి విజయం కోసం ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ శ్రమిస్తున్నారు. అయితే బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మూడు పార్టీలు రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి.

2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగియనుంది. 2015 నుంచి ఢిల్లీలో ఆప్ అధికారంలో కొనసాగుతోంది. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాల్లో 62 స్థానాలు గెలుచుకుని అధికార పగ్గాలు సొంతం చేసింది. మిగిలిన 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది.

గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం?

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 62.82 శాతం పోలింగ్ శాతం నమోదయ్యింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఇది 4.65 శాతం తక్కువ.

ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడం వంటి కారణాలతో ఈ సారి ఆప్ ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి రావడం నల్లేరుమీద బండి నడకకాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే తమ ప్రజాసంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్, మెరుగైన తాగునీరు, విద్యా వసతులు తమకు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయని ఆప్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అటు ఒంటరిగా పోటీ చేసి ఢిల్లీ అసెంబ్లీలో తమ సత్తా చాటుతామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

ఈసారి త్రిముఖ పోరుతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి.