గూడు కోల్పోయి కొందరు.. సర్వం కోల్పోయి మరికొందరు.. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే.. ఎవరిని కదిపినా కన్నీటి వ్యథలే.. ఫెయింజల్ తుఫాన్ విషాదాన్ని మిగిల్చింది. ఫెయింజల్ తుఫాన్.. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిని అతలాకుతలం చేసింది. గతకొన్ని రోజులుగా దంచికొడుతున్న వర్షాలకు బయట అడుగుపెట్టే పరిస్థితి లేదు. అలాగని ఇంట్లో ఉన్నా క్షేమమే అన్న గ్యారంటీ లేదు. తుఫాన్ దాడికి తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్దపెద్ద బండరాళ్లు యముడిలా వచ్చి ఓ ఇంటిపై అమాంతం పడిపోవడంతో… ఇళ్లే సమాధి అయ్యింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఏడుగురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ ఏడుగురిలో ఐదుగురు చిన్నపిల్లలు ఉండటం కలచివేస్తోంది. అభంశుభం తెలియని చిన్నారులను ఫెయింజల్ తుఫాన్ బలితీసుకోవడంతో.. చుట్టుపక్కల గ్రామాల్లో విషాధచాయలు అలుముకున్నాయి.
ఇటు కృష్ణగిరిలో వరదకు వాహనాలు కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయి జలాశయంలో కలిసిపోయాయి. పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. బాహ్యప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. దీంతో తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లులేక అల్లాడుతున్నారు. ఇటు పుదుచ్చేరిలోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించింది. బయట అడుగుపెట్టలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీవర్షాలకు చెట్లు నేలకూలాయి. రహదారులకు అడ్డంగా భారీ చెట్లు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా కనపడట్లేదు. పలుచోట్ల విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకట్లోనే బిగ్గుబిగ్గుమంటున్నారు జనాలు. ఇటు కేరళలోనూ తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
ఫెయింజల్ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్‌పైనా ఉంది. రాయలసీమ, కోస్తాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. తుఫాన్ ప్రభావంతో 435 ఎకరాల్లో వరిపంట నష్టం జరిగింది. 53 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతిన్నది. భారీవర్షాలకు జలాశయాలకు వరద పోటెత్తింది. చిత్తూరుతో పాటు అన్నమయ్య జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. మొత్తంగా… ఫెయింజల్ తుఫాన్ తీరం దాటి కాస్త బలహీనపడినప్పటికీ… తీరని శోకాన్ని మిగిల్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..