Heavy Rains: ఉప్పొంగుతున్న నదులు.. హరిద్వార్‌లో ఇళ్లల్లోకి దర్శనమిస్తున్న మొసళ్లు.. భయందోళనల్లో స్థానికులు
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయవుతున్నాయి. మరికొన్ని చోట్ల వరదల ప్రభావంతో జనజీవనం స్థంభించిపోయింది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయవుతున్నాయి. మరికొన్ని చోట్ల వరదల ప్రభావంతో జనజీవనం స్థంభించిపోయింది. ఈ వర్షకాల సమయంలో ప్రజలకు వరదలతో పాటు మరో భయం పట్టుకుంది. వాతావరణం అంతా తేమగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో సరిసృపాలు, పాములు, తేళ్లు బయటపడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల్లో ఇలాంటి సమయంలో పాము, తేలు కాట్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఉత్తరఖాండ్‌లోని హరిద్వార్ జిల్లా లక్సర్, ఖాన్‌పూర్ ప్రాంతాల్లో ఏకంగా మొసళ్లు దర్శననిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే యమునా, గంగా లాంటి నదులు పొంగిపొర్లుతున్నాయి. హరిద్వార్ జిల్లాలోని గంగా నది నీటి ప్రభావానికి మొసళ్లు బయటపడుతున్నాయి. లక్సర్, ఖాన్‌పూర్ ప్రాంతాల్లోని జనావాసాలకు మొసళ్లు వస్తున్నాయి. దీంతో స్థానికులు భయందోళన చెందుతున్నారు.
అయితే ఫారెస్టు అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. గంగానది దాని ఉపనదులైన బాన్ గంగా, సొనాలి లాంటి నదులు ఉప్పొంగడం వల్ల వాటి నుంచి వస్తున్న సరిసృపాలను పట్టుకుంటున్నారు. అలాగే వాటిని మళ్లీ నదిలోనే విడిచిపెడుతున్నారు. ప్రజలు ఎక్కువగా నివసించే సమీప ప్రధాన నదులు నుంచి ఇప్పటివరకు దాదాపు 12 మొసళ్లను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా లక్సార్, ఖాన్‌పూర్ ప్రాంతాల్లో మొసళ్లు పట్టుకునేందుకు 25 మంది సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత వారంలోనే భారీ వర్షాల వల్ల గంగా నది నీటి స్థాయి రికార్డు స్థాయికి పెరిగిపోయింది. దీంతో లక్సార్, ఖాన్‌పూర్ ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. అలాగే సొనాలి రివర్‌పై ఉన్న ఆనకట్ట తెగిపోవడంతో వరద పరిస్థితి మరింత దిగజారింది.








