Covid cases rising: ఇండియాలో మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, కొత్త వేరియంట్లపై మనం అప్రమత్తం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. థర్డ్ కోవిడ్ రాకుండా నివారించేందుకు కనీస ప్రొటొకాల్స్ ను పాటించాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని, గుంపులు..గుంపులుగా సమావేశాలు కారాదని అన్నారు. హిల్ స్టేషన్లు, మార్కెట్లలో జనం మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని, ఇలాఅయితే థర్డ్ వేవ్ ని నిరోధించలేమని ఆయన చెప్పారు. మంగళవారం 8 ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో వర్చ్యువల్ గా జరిగిన సమావేశంలో మాట్లాడిన మోదీ..టూరిజం, బిజినెస్ వంటి రంగాలు దెబ్బ తిన్న మాట వాస్తవమేనని, కానీ ఎలాంటి కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్ల పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందన్నారు. వైరస్ దానంతట అదే వచ్చి పోదని..రూల్స్ ని పాటించకపోతే దాన్ని మళ్ళీ మనమే మన వెంట తీసుకువస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఓవర్ క్రౌడింగ్ కారణంగా కేసులు పెరుగుతాయి. ఇది తెలిసి కూడా మనం తిరిగి పొరబాటు చేస్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు మాస్కులు ధరించాల్సిందే.. పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహించడం సముచితం కాదు.. ముఖ్యంగా వ్యాక్సినేషన్ జోరు పెరగాలని ప్రజలు తప్పనిసరిగా టీకామందు తీసుకోవాలని ఆయన అన్నారు. హిమాచల్ లోని మనాలి వంటి హిల్ స్టేషన్లలోనూ, పెద్ద నగరాల మార్కెట్లలో జనాలు, టూరిస్టులు మాస్కులు లేకుండా కనబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ నేపథ్యంలో మోదీ ఇలా పలు సూచనలు చేశారు. కొత్త వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వీటిపై నిపుణులు ఇప్పటికే పలు సూచనలు చేసినట్టు ఆయన చెప్పారు. కాగా ఇండియాలో గత 24 గంటల్లో 31,443 కోవిడ్ కేసులు నమోదు కాగా-2020 మంది కోవిడ్ రోగులు మరణించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : ముంచుకొస్తున్న సౌర తుఫాన్..గతంలో సూర్యుడి ఉపరితలంపై భారీ తుఫాను..:Solar Storm Moving To Earth Live Video.