AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: కరోనా కొత్త వేరియంట్ భయం.. తెలంగాణలో హై అలర్ట్.. విదేశీ ప్రయాణికులపై నిఘా..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కేంద్రప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికిప్పుడు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు..

Covid-19: కరోనా కొత్త వేరియంట్ భయం.. తెలంగాణలో హై అలర్ట్.. విదేశీ ప్రయాణికులపై నిఘా..
High Alert In Airport (representative Image)
Amarnadh Daneti
|

Updated on: Dec 22, 2022 | 9:49 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కేంద్రప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికిప్పుడు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు, కోవిడ్‌ ప్రొటోకాల్ పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచిస్తుంది. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని వైద్య, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ చైనా, అమెరికా, జపాన్, దక్షిణకొరియా దేశాలను భయపెడుతున్న క్రమంలో దేశంలోనూ ఈ కేసులపై అలజడి మొదలైంది. ఇప్పటికే విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ర్యాండమ్‌గా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలోని ప్రధాన విమానశ్రయాలైన ఢిల్లీ, ముంబయి, కొల్‌కత్తా, చెన్నై, బెంగళూరుతో పాటు.. హైదరాబాద్‌ విమానశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చేవారిలోనే కొత్త వేరియంట్ కేసులు బయటపడుతుండటంతో ముఖ్యంగా గత కొద్దిరోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారి జాబితా సేకరించి.. వారిలో ఆరోగ్య లక్షణాలు ఆధారంగా పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే నమూనాలను జీనోమ్‌ సీక్వెన్స్‌కి పంపించనున్నారు.

మరోవైపు కేంద్రప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించింది. మరోవైపు ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతోంది. చైనా, అమెరికాతో సహా వివిధ దేశాల్లో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో చాలా మంది ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న కోవిడ్ బులిటెన్‌ ప్రకారం కరోనా కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉంది. డిసెంబర్ 20వ తేదీన రాష్ట్రంలో ఐదు కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీరిలో నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారే. గత వారం రోజుల్లో హైదరాబాద్‌లో 24 కోవిడ్ కేసులు నమోదు కాగా నిజామాబాద్‌లో మూడు, రంగారెడ్డిలో 2, మహబూబ్‌నగర్‌లో ఒకటి, ఖమ్మంలో 1, నిజామాబాద్‌లో 1, కామారెడ్డి 1, హనుమకొండ 1, ఆదిలాబాద్‌లో 1 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 20 నాటికి తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య 34 కాగా, రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..