ఈ ఒంటి చేయి క్రూరుడు.. జైలు ఊచలు తొలగించి.. 25 అడుగుల గోడ ఎక్కి…

అత్యాచార కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీ గోవిందచామీ సినిమా స్టైల్లో సెల్‌లోని ఇనుప కడ్డీలను తొలగించుకొని.. దుస్తులతో తయారుచేసుకొన్న తాడు సహాయంతో జైలు గోడను దూకి ఎస్కేప్ అయ్యాడు. ఒక చేయి లేని గోవిందచామీ ఇంత తతంగం నడిపి తప్పించుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఒంటి చేయి క్రూరుడు.. జైలు ఊచలు తొలగించి.. 25 అడుగుల గోడ ఎక్కి...
Govindachamy

Updated on: Jul 25, 2025 | 6:18 PM

కేరళను వణికించిన కరుడుగట్టిన నేరస్తుడు గోవిందచామి… ఎంత క్రూరుడో ఇప్పుడు మీకు వివరించబోతున్నాం. ఇతగాడు అలాంటి ఇలాంటి నేరస్తుడు కాదు. కేరళ క్రైమ్‌ చరిత్రలో తనకంటూ ఏకంగా ఓ సెపరేట్‌ చాప్టర్‌ను రాసుకున్న రక్తచరిత్ర ఇతగాడిది. గోవిందచామి అలియాస్‌ చార్లీ ధామస్‌…కేరళ క్రైమ్‌ హిస్టరీలో ఓ స్పెషల్‌ కేరక్టర్‌. 2011లో పంజాబ్‌-కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ యువతిపై అత్యంత పాశవికంగా దాడి చేసి, ఆమెను ట్రైన్ నుంచి తోసేసి.. తాను కూడా దూకి… అత్యాచారం చేసి.. ఆమె వద్ద ఉన్న వస్తువులను తీసుకుని పరారయ్యాడు ఈ రాక్షసుడు.  ఆ తర్వాత ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.  ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీ ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. గోవిందచామికి ఒక చెయ్యి మాత్రమే ఉంటుంది. అయినా ఇంత ఘోరానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కోర్టులు, కేసులు విచారణ తర్వాత…గోవిందచామికి జీవిత ఖైదు పడింది. కన్నూర్‌ సెంట్రల్‌ జైల్లో హై సెక్యూరిటీ సెల్‌లో ఇతగాడు శిక్ష అనుభవిస్తున్నాడు. శుక్రవారం అదే సెంట్రల్‌ జైలు నుంచి, కరుడు గట్టిన నేరస్తుడు గోవిందచామి తప్పించుకోవడం కలకలం రేపింది. పోలీసు వర్గాలనే కాదు…సామాన్య జనాన్ని కూడా ఈ సంఘటన కలవరపరిచింది. ఇనుప చువ్వలు వంచేసి, జైలు గోడకు పొడవాటి వస్త్రాన్ని కట్టి, దాని ద్వారా పారిపోయాడు గోవిందచామి. #KannurJailEscape హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇక జైలు నుంచి పారిపోయిన గోవిందచామి కోసం కేరళ పోలీసులు…అతి పెద్ద మేన్‌ హంట్‌ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కన్నూర్‌ సెంట్రల్‌ జైలులోని హైసెక్యూరిటీ సెల్‌ నుంచి పారిపోయిన గోవిందచామిని భారీ గాలింపు ఆపరేషన్‌ తర్వాత పోలీసులు పట్టుకున్నారు. అతడు జైలుకు సమీపంలోని తలాప్‌ ప్రాంతంలో ఉన్న నేషనల్‌ శాంపిల్‌ సర్వే కార్యాలయం వెనుక భాగంలో ఓ బావిలో దాక్కున్నట్లు గుర్తించిన పోలీసులు ఉదయం 10:30 ప్రాంతంలో అతడిని అరెస్ట్‌ చేశారు. అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న అతడిని జైలు నుంచి తప్పించుకున్న కొద్ది గంటల్లోనే పోలీసులు పట్టుకోవడం ప్రభుత్వ యంత్రాంగానికి ఊరట కలిగించింది.

బావిలో దాక్కున్న గోవిందచామిని బయటకు తీశాక, అతగాడిని అత్యంత భారీ భద్రత మధ్య, మళ్లీ కన్నూరు జైలుకు తరలించారు పోలీసులు. ఈ దృశ్యాన్ని చూడడానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు.

గోవిందచామి ఎస్కేప్‌ ప్లాన్‌, ఇలా బెడిసికొట్టింది. గోవిందచామి కేసు…అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్వేగాలు రేపింది. పెద్దఎత్తున చర్చకు దారితీసింది. బాధితురాలికి న్యాయం జరగాలంటూ సాగిన పోరాటం, గోవిందచామిపై జరిగిన విచారణ, న్యాయస్థానాల్లో జరిగిన వాదోపవాదనలు, అంతిమ తీర్పు…ఇవన్నీ దశాబ్ద కాలం జనం నోళ్లలో నానుతూ వచ్చింది. కేరళలోని ప్రతి ఇంట్లో చర్చకు దారితీసింది.