Explained: తెలివైన నేరస్తులకు ఇక దబిడిదిబిడే.. అమల్లోకి వచ్చిన కొత్త చట్టం.. న్యూ యాక్ట్ ఏం చెప్తుందంటే..

Criminal Procedure (Identification) Act 2022: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేరాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు నేరస్తులను పట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నా..

Explained: తెలివైన నేరస్తులకు ఇక దబిడిదిబిడే.. అమల్లోకి వచ్చిన కొత్త చట్టం.. న్యూ యాక్ట్ ఏం చెప్తుందంటే..
Home Minister Amit Shah (File Photo)Image Credit source: TV9 Telugu
Follow us
Amarnadh Daneti

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 05, 2022 | 12:10 PM

Criminal Procedure (Identification) Act 2022: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేరాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు నేరస్తులను పట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నా.. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దోషులు తప్పించుకునే మార్గాలు ఎంచుకుంటున్నారు. దీంతో బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1920లో తీసుకొచ్చిన నేరస్తుల గుర్తింపు చట్టానికి మరిన్ని సవరణలు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) యాక్ట్- 2022 ఆగష్టు 4వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఈచట్టం ద్వారా నేరస్తులను త్వరగా గుర్తించవచ్చని కేంద్రప్రభుత్వం చెబుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం ఇదొక రకంగా చాలా క్రూరమైన చట్టమంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏది ఏమైనా నేర ప్రక్రియను త్వరగా గుర్తించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ఈఏడాది ఏప్రియల్ లో పార్లమెంటు ఆమోదం పొందటంతో చట్టంగా మారింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈనెల 3వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ తో 4వ తేదీ నుంచి ఈచట్టం అమలులోకి వచ్చినట్లైంది. జాతీయవాదం బాగా విస్తరిస్తున్న వేళ ప్రజలపై నిఘా పరిధిని విస్తరించడానికి బ్రిటిషు పాలకులు నేరస్తుల గుర్తింపు చట్టాన్ని తీసుకొచ్చారు. పాత చట్టం ప్రకారం నేరస్థుల ఫోటోగ్రాఫ్లు, వేలిముద్రలు, పాద ముద్రలు వంటి వాటిని సేకరించి భద్రపరిచే అధికారాలను చట్టాన్ని అమలుచేసే అధికారులకు అప్పగించింది. అయితే పాత చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ మోదీ ప్రభుత్వం ఇంకొన్ని సవరణలు చేసింది. ఈకొత్త చట్టం ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందా..

దేశంలో ఎక్కడైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ప్రాథమికంగా సేకరించే ఆధారాల్లో వేలిముద్రలు ఎంతో కీలకమైనవి.. ఈఆధారాలను ప్రభుత్వ డేటా బ్యాంకులోని వివరాలతో పోల్చినప్పుడు నేరస్తుల గుర్తింపు ఈజీ అవుతుంది. అయితే ఈవిధానంలో తెలివైన నేరగాళ్లను పట్టుకోవడం కొంచెం కష్టంగా మారడంతో క్రిమినల్ ప్రోసీజర్ చట్టంలో కేంద్రప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఐరీష్ విధానంలో కంటిపాప ఆధారంగా నేరస్తులను గుర్తించగలిగే పద్దతిని ప్రవేశపెడుతూ..క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) యాక్ట్- 2022ను తీసుకొచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల దర్యాప్తు పరిధిని విస్తృతం చేయడం కోసం కొత్త చట్టంలో మెజర్ మెంట్ అనే పదాన్ని చేర్చి దీనికి విస్తృత అర్థాన్ని ఇచ్చారు. వేలిముద్రలతో పాటు రెటీనా, ఐరిస్, జీవ నమూనాలను సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా దోషులను త్వరగా పట్టుకోవడానికి దర్యాప్తు సంస్థలకు సమాయపడనుంది. డేటాను కేంద్ర స్థాయిలో భద్రపర్చడం వల్ల దోషులను గుర్తించడం తేలిక కానుంది. నేటి సమాజంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పాత పద్దతి ఆధారంగా దర్యాప్తు చేయడం కష్టతరమవుతున్న నేపథ్యంలో దర్యాప్తులో వేగం, నాణ్యత కోసం ఆధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని నిర్ణయించిన కేంద్రప్రభుత్వం నేర ప్రక్రియ గుర్తింపునకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

నేరాల దర్యాప్తులో భాగంగా నిందితుల సమాచారం, ఆదారాలు సేకరించడానికి దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలను కొత్త చట్టంలో కల్పించారు. గతంలో సబ్ ఇన్ స్పెక్టర్ ఆపై స్తాయి అధికారులకు మాత్రమే నిందితుల వివరాలు సేకరించే అధికారం ఉండగా… ఇక నుంచి హెడ్ కానిస్టేబుల్ ఆ పై ర్యాంకు, జైలులో హెడ్ వార్డెన్ ఆపై స్థాయి అధికారులు కూడా ఆధారాలు సేకరించవచ్చు. ఇదే సమయంలో ఏ స్థాయి నేరాల్లో నిందితుల వ్యక్తిగత వివరాలు, బయోలాజికల్ శాంపిల్స్ తీసుకోవాలనేదానిపై చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన నేరాలు, ఏడేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలు మినహిస్తే మిగతా కేసుల్లో నిందితుల జీవ నమూనాలు సేకరించకూడదు. రికార్డులు భద్రపర్చడం, కొలతల సంరక్షణ వంటివి హోమంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో -NCRB ద్వారా చేపడతారు. సేకరించిన ఆధారాలను 75 సంవత్సరాల పాటు డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా ఉంచుతారు. నేరాల్లో నిందితులు కొలతలు ఇవ్వడానికి నిరాకరించడం కొత్త చట్టంప్రకారం క్రిమినల్ చర్యల కిందకి వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) యాక్ట్- 2022 అమలుపై ప్రతిపక్షాలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈచట్టం ద్వారా దోషులు మాత్రమే కాకుండా అమాయక వ్యక్తుల ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని వాదిస్తున్నాయి.

నేర ప్రక్రియ గుర్తింపు బిల్లను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాల అనుమానాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివృత్తిచేసే ప్రయత్నం చేశారు. నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థలు సేకరించి ఆధారాలు, వ్యక్తిగత వివరాలు, జీవ నమూనాలు దుర్వినియోగం కాకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరసనలకు పాల్పడే రాజకీయ పార్టీలను ఈచట్టం పరిధిలోకి తీసుకురాబోమని అమిత్ షా స్పష్టం చేశారు. అయితే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) యాక్ట్- 2022 పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత న్యాయ సమీక్ష కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. ఈచట్టంలో కొన్ని అంశాలు భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని ఈపిటిషన్ లో పేర్కొన్నారు. ఈఅంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ కేసు ఈఏడాది నవంబర్ 22న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. మరోవైపు పార్లమెంటులో ఈబిల్లును విపక్ష పార్టీలన్ని వ్యతికేరించగా.. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈబిల్లు ఆమోదం పొందేందుకు మద్దతు తెలిపింది. మొత్తంమీద పార్లమెంటు ఉభయ సభల్లో నేర ప్రక్రియ గుర్తింపు బిల్లును చట్టంగా తీసుకొచ్చేందుకు అవసరమైన బలం ఎన్డీయే ప్రభుత్వానికి ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేర ప్రక్రియ గుర్తింపు బిల్లు చట్టరూపం దాల్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం