మైసూరు: టిప్‌టాప్‌గా రెడీ అయ్యి.. చక్కగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ ఏకంగా 15 మందిని వలలో వేసుకున్నాడో నిత్య పెళ్లికొడుకు. అనక డబ్బు బంగారంతో ఉడాయించేవాడు. ఇలా పెళ్లిళ్ల పేరుతో మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్న నిందితుడిని మైసూరు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని బెంగళూరులోని బనశంకరిలో నివాసం ఉంటున్న మహేష్ కేబీ నాయక్ (35)గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకెళ్తే..
మ్యాట్రిమోనియల్ సైట్‌లను ఉపయోగించి మహేష్ మహిళలను వలలో వేసుకునేవాడు. తనని తాను ఇంజనీర్‌గా, డాక్టర్‌గా పరిచయం చేసుకునేవాడు. తుమకూరులో ఏర్పాటు చేసిన నకిలీ క్లినిక్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు నమ్మబలికేవాడు. అంతేకాకుండా దారాళంగా మాట్లాడే అతని ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్ స్కిల్స్ విని పలువురు మహిళలు సులువుగా మోసపోయారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన హేమలత (30) అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేష్ వ్యవహారం వెలుగు చూసింది.
బాధితురాలు హేమలత మైసూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. అతని మాయమాటలు నమ్మిన హేమలతతో 2023 జనవరిలో మహేష్ వివాహం జరిగింది. అనంతరం క్లినిక్ ఏర్పాటు చేయాలని డబ్బు కోసం ఆమెను వేధించసాగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె నగలు, నగదు తీసుకుని పరారయ్యాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు 2014 నుంచి ఇప్పటి వరకు పెళ్లి పేరుతో మహేష్ ఏకంగా 15 మంది మహిళలను మోసం చేశాడు. అతను వివాహం చేసుకున్న వారిలో చాలా మంది మహిళలు బాగా చదువుకున్నవారు కావడం మరో విశేషం. మోసపోయామని గ్రహించినప్పటికీ పరువుపోతుందనే భయంతో వారిలో చాలా మంది మహిళలు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.