Indian Politics: ప్రాంతీయ పార్టీల హవాతో మునిగిపోతున్న కాంగ్రెస్.. ఎదురీదుతున్న బీజేపీ..

Indian Politics: ప్రాంతీయ పార్టీల హవాతో మునిగిపోతున్న కాంగ్రెస్.. ఎదురీదుతున్న బీజేపీ..
Third Front

Congress - BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. ప్రాంతీయ పార్టీలైన సమాజ్‌‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ నాయకులతో కలిసి ఆమె ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.

Shaik Madarsaheb

|

Mar 06, 2022 | 2:02 PM

Congress – BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. ప్రాంతీయ పార్టీలైన సమాజ్‌‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ నాయకులతో కలిసి ఆమె ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. అయితే.. అఖిలేశ్ కూటమికి మద్దతు తెలపడం.. వారికి ప్రచారం చేయడం ఢిల్లీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. మమతా సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికలలో టీఎంసీ పార్టీ దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకొని తిరుగులేని శక్తిగా నిలిచింది. అయితే.. ఈ ఎన్నికలు జాతీయ పార్టీల మనుగడపై ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీల (regional parties) సహాయంతో ఢిల్లీ రాజకీయాలను భర్తీ చేసి గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టాలనే ఆమె సంకల్పానికి మరింత బలం చేకూర్చినట్లయింది. ఇటీవలనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలలో బలమైన తృతీయ శక్తిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఊతమిచ్చాయి. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టడం లేదా వారితోనే జాతీయ పార్టీ జతకట్టాలనే సూచనలు చేశాయి. లేకపోతే.. పార్టీ మరింత మునిగిపోతుందని గుర్తుచేశాయి. అయితే.. ఈ ఎన్నికలతో బీజేపీ ఇంకా పోరాటాన్ని కొనసాగిస్తుందంటూ వ్యాసకర్త అజయ్ ఝా పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పతనం కొనసాగుతుండగా, ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో ప్రభావం అంత సులభం కాదని బీజేపీ గ్రహించిందని అజయ్ ఝా తన వ్యాసంలో వెల్లడించారు.

ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ క్రమంలో అధికారంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్షాలు పాలిస్తున్న మూడు రాష్ట్రాల్లో తక్కువ ప్రభావం చూపినట్లు వార్తలు వచ్చాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కి బీజేపీ గట్టి పోటీని ఇవ్వడంతో పాటు 294 మంది సభ్యుల అసెంబ్లీలో 77 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తొమ్మిది నెలల్లోనే బెంగాల్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. దీనికి ఉదాహరణగా ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికలు నిలిచాయి. ఈ ఎన్నికల్లో TMC 108 మునిసిపాలిటీలలో 102 గెలుచుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా.. TMC రిగ్గింగ్ చేసిందని ఓటర్లను బెదిరింపులకు గురిచేసిందని ఆరోపిస్తూ బిజెపి ఫలితాన్ని తిరస్కరించింది.

అయితే.. పశ్చిమ బెంగాల్ పౌర ఎన్నికలకు ముందు తమిళనాడులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఒడిశాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (ద్రవిడ్ మున్నేట్ర కజగం-DMK), ప్రతిపక్షపార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ్ మున్నేట్ర కజగం (AIIDMK) తర్వాత కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. ఇతర ప్రాంతీయ పార్టీలతో పోల్చుకుంటే.. కేవలం 5.5 శాతం ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచింది. అయితే.. ఇక్కడ బీజేపీ కంటే మెరుగ్గా ఉన్నట్లు అనుకోవచ్చు. కానీ ఫలితం ఆశించినంతగా లేదు.

ఒడిశా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో రెండవ అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ ఆవిర్భవించింది. అయితే రాష్ట్రంలోని అధికార బిజూ జనతాదళ్ (బిజెడి) ఈ ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించింది. బీజేడీకి 52.73 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 30.07 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 13.57 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇంకా 109 అర్బన్ బాడీలకు మార్చి 24న పోలింగ్ జరగనున్నాయి. అయితే.. ఒడిశాలో బీజేపీ పార్టీకి బలమేంటో నిరూపించుకునేందుకు మరో అవకాశం లభించనుంది.

2019 అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికల్లో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో బీజేపీ BJD కంటే ముందంజలో ఉంది. వీటిని పరిశీలిస్తే.. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ తక్కువగా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. కానీ మరో జాతీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు పూర్తిగా నిరాశపరిచాయి. అయితే.. బీజేపీ పార్టీని విస్తరించేందుకు తమిళనాడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రంలో రాజకీయంగా బలంగా ఉండేందుకు డీఎంకే కూటమిలో కొనసాగుతోంది. అయితే.. మిగిలిన రెండు రాష్ట్రాల్లో మనుగడ కోసం పోరాటం చేసి అంతగా ప్రభావం చూపలేదు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాల అనంతరం కేంద్రంలో బలమైన ప్రతిపక్షం కోసం ఖాళీగా ఉన్న స్థలాన్ని భర్తీ చేయడానికి ప్రాంతీయ పార్టీలు వేగంగా కదులుతున్నాయని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

2024 పార్లమెంటరీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను కలుపుకోగలిగితే తప్ప, బీజేపీకి సవాలుగా నిలవడంలో విఫలమవుతుందనేది కాదనలేని వాస్తవం. ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పవిత్ర నగరమైన వారణాసికి వచ్చి రెండు ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి సంయుక్త ర్యాలీలో ప్రసంగించడం ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఆమోదయోగ్యం కాదనే మరో సూచనను చెప్పకనే చెప్పారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ మనుగడ కోసం తాపత్రయపడుతోంది. ఎందుకంటే ఇతర పార్టీలు దానితో జత కట్టేందుకు నిరాకరించడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో.. ఒక్క మణిపూర్‌లో వామపక్షాలతో లాంఛనప్రాయ పొత్తును మినహాయించి, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా మిగిలిపోయింది. ప్రస్తుతం మమతా బెనర్జీ సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌తో జతకట్టారు. దీంతోపాటు సమాజ్‌వాదీ పార్టీకి ప్రచారం చేయడం 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు వీలైనన్ని ఎక్కువ ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు మమతా తన వ్యూహాన్ని కొనసాగిస్తున్నారనే వాస్తవాన్ని సూచిస్తున్నారు. ఆ విధంగా ఆమె బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల కూటమిని ఏర్పాటు చేసేలా వ్యూహం రచిస్తున్నారు. ఈ క్రమంలో మునిగిపోతున్న కాంగ్రెస్‌ను వదిలిపెట్టేందుకు ఈ వ్యూహాన్ని మమతా అవలంభిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించదన్న విషయం తెటతెల్లమవుతోంది. ఇక బీజేపీ విషయానికొస్తే మూడు రాష్ట్రాలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు నష్టం కలిగించేవి ఏం కాదు. రాబోయే రెండేళ్లలో ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయంగా బీజేపీ బలపడుతుందని.. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటు వేసేటప్పుడు ఓటర్లు భిన్నమైన అభిప్రాయాలతో ఉంటారని అదే కలిసి వచ్చే అంశమని బీజేపీ ఊహిస్తోందని అజయ్ ఝా పేర్కొన్నారు.

Also Read:

Firing: అమృత్‌సర్ బీఎస్ఎఫ్ క్యాంప్‌లో దారుణం.. తోటి సిబ్బందిపై కాల్పులు జరిపిన జవాన్..

Pension Scheme: ఈ స్కీమ్‌లో నెలకు రూ.55 డిపాజిట్‌ చేస్తే.. ప్రతి నెల రూ.3వేల పెన్షన్‌

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu