sonia gandhi letter to pm modi: ప్రధాని మోదీకి సోనియాగాంధీ లేఖ.. ప్రధానంగా 3 సమస్యల ప్రస్తావన..!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు.
sonia gandhi letter to pm modi: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితులను వివరిస్తూ.. సోనియా గాంధీ ఈ లేఖలో పేర్కొన్నారు. కోవిడ్-19 పరిస్థితులపై.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల మంత్రులతో తాను సుధీర్ఘంగా మాట్లాడినట్టు వివరించారు.
కరోనా కట్టడిలో కలిసి పనిచేద్దామన్న సోనియా.. ప్రధానంగా 3 సమస్యలను తన లేఖలో ప్రస్తావించారు. వాటిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అవసరమైన మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డోసులను అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి ఉపయోగించే పరికరాలను, మెడిసిన్‌ను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంక్షలు అమలు చేస్తే.. కూలీలు, పేదల కోసం కనీస నెలవారీ ఆదాయ హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని సోనియా గాంధీ లేఖలో పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ:
Congress Interim President Sonia Gandhi has written a letter to PM Modi over the current situation in the country due to rising COVID19 cases pic.twitter.com/RChp7qLcKW
— ANI (@ANI) April 12, 2021
వ్యాక్సిన్ అనేది కరోనా ఎదుర్కొవడానికి మన ముందున్న ఆశ. చాలా రాష్ట్రాల్లో కేవలం 3 నుంచి 5 రోజులకు సరిపడ మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ నిలువలు ఉన్నాయని సోనియా గాంధీ.. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఓవైపు కోవిడ్ వ్యాక్సిన్ దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, మరోవైపు తగిన సామర్థ్యం ఉన్న టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.
అలాగే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే అర్హుల జాబితాను విస్తృతం చేయాలన్న సోనియా.. కేవలం వయసు ఆధారంగా మాత్రమే కాకుండా ప్రజల అవసరానికి అనుగుణంగా అర్హులను టీకా అందేలా చూడాలన్నారు. వివిధ రాష్ట్రాలో కరోనా తీవ్రత, అక్కడి పరిస్థితులను ఆధారంగా చేసుకుని వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేయాలన్నారు.
కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి అవసరమైన అన్ని పరికరాలను, ఔషధాలను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించాలని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే వెంటిలేటర్లు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ సిలిండర్లపై ఉన్న జీఎస్టీని తొలగించాలని సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై కూడా పన్నుల మినహాయింపులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
ఇక, కరోనా నియంత్రణలో భాగంగా కర్ఫ్యూలు, ప్రయాణ ఆంక్షలు, మూసివేతలు, లాక్‌డౌన్‌ల ద్వారా పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని ప్రయత్నించినప్పుడు ప్రజలకు తగిన వెసులుబాటు కల్పించాలన్నారు. ఇప్పటికే ఇబ్బందులను గురైన ప్రజలను, ముఖ్యంగా పేదలు, రోజువారీ కూలీలను ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే కనీస నెలవారీ హామీ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ. 6 వేలు వారి ఖాతాలోకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులకు వారు పనిచేసే చోటుతో పాటు, స్వరాష్ట్రాల్లో అవసరమైన పునవారసం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also… ఇండియాలో అందుబాటులోకి మరో కోవిడ్ వ్యాక్సిన్