CONGRESS PARTY: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం దిశగా కీలక అడుగు.. జీ23 నేతల సూచనలపై సోనియా స్పందన.. వచ్చేవారం కీలక భేటీ

| Edited By: Shiva Prajapati

Mar 19, 2022 | 11:21 PM

నెహ్రూ (గాంధీ) కుటుంబానికి చెందిన నాలుగో తరం కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ పర్ఫార్మెన్స్ దారుణ స్థితికి చేరుకుంది. నిజానికి 2014 కంటే చాలా ముందే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నేతగా..

CONGRESS PARTY: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం దిశగా కీలక అడుగు.. జీ23 నేతల సూచనలపై సోనియా స్పందన.. వచ్చేవారం కీలక భేటీ
Congress
Follow us on

CONGRESS PARTY HIGH-COMMAND TO CONDUCT CRUCIAL MEET NEXT WEEK: కాంగ్రెస్ పార్టీ.. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ.. స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన పార్టీ. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని సుదీర్ఘకాలంపాటు ఏకచ్ఛాత్రాధిపత్యంగా పాలించిన పార్టీ. కారణాలేవైతేనేం 2014 తర్వాత ఆ పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరిందనే చెప్పాలి. ఈ మాట కాస్త కటువుగా వున్నా నిజమేనని 2014 నుంచి ఏ ఎన్నిక జరిగినా ఆ పార్టీ గెలుచుకుంటున్న సీట్ల సంఖ్య చాటుతోంది. నెహ్రూ (గాంధీ) కుటుంబానికి చెందిన నాలుగో తరం కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ పర్ఫార్మెన్స్ దారుణ స్థితికి చేరుకుంది. నిజానికి 2014 కంటే చాలా ముందే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నేతగా రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేశారు. ముందుగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర బాద్యతలప్పగించి 2012 అసెంబ్లీ ఎన్నికల పోరులో గెలిచే బాధ్యతలను రాహుల్ గాంధీపై పెట్టారు. ఆనాటి యుపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ పతనం కొనసాగింది. ఆ తర్వాత 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లోను, 2017, 2022 యుపీ అసెంబ్లీ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ యుపీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అటు 2012 తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. 2017లో గోవా ఎన్నికల్లో మొత్తం 40 సీట్లకు గాను 18 సీట్లను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మంత్రాంగం నడపడంలో కాంగ్రెస్ అధిష్టానం ఫెయిలయ్యిందనే చెప్పాలి. చిన్న గ్యాప్ దొరికితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ.. కాంగ్రెస్ పార్టీని చీల్చి.. గోవా సీఎం సీటును దక్కించుకుంది. ప్రమోద్ సావంత్ సారథ్యంలో ప్రభుత్వాన్ని నడిపి.. అయిదేళ్ళ తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా విజయం సాధించే స్థాయికి ఎదిగింది.

కాంగ్రెస్ పార్టీ వరుసగా పరాజయాల పాలవుతున్నా సాహసోపేతమైన, వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోకపోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. పరిశీలకులనే కాకుండా కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయాలలో చిరకాలంపాటు క్రియాశీల పాత్ర పోషించిన కాంగ్రెస్ సీనియర్లు సైతం అధినేత తీరుపై కినుక వహించారు. జీ23 పేరిట ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. తమ నిరసనను అధిష్టానానికి తెలిపే ప్రయత్నం చేశారు. వీరిలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ లాంటి పార్టీ మౌత్ పీస్‌లు కూడా వుండడం జాతీయస్థాయి రాజకీయ పరిశీలకులను తొలుత నివ్వెర పరిచింది. ఆనక అసలా సీనియర్ నేతలు ఎందుకలా కినుక వహించారో.. పార్టీ అధినేత్రికి ఏం సమాచారం పంపాలని భావించారో తెలిసిన తర్వాత సీనియర్ల ఆవేదనలో అర్థముందని అందరు గ్రహించారు. పార్టీ విధాన నిర్ణయాలను, వ్యూహాలను మార్చుకోవాలని.. మారిన పరిస్థితికి అనుగుణంగా పార్టీలో వ్యూహరచన జరగాలని జీ23 నేతలు అధినేత్రికి సమాచారం పంపారు. అయితే.. తొలినాళ్ళలో ఈ గ్రూపు నేతలను అధినేత్రి సోనియా గాంధీ సీరియస్‌గా తీసుకోకపోవడం పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చిందనే చెప్పాలి. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింతగా పడిపోయింది. యుపీలో కేవలం రెండంటే రెండు సీట్లను గెలుచుకుంది. అటు పంజాబ్ రాష్ట్రంలో అధికార పార్టీగా ఎన్నికల బరిలోకి దిగి చాలా దారుణమైన ఫలితాన్ని పొందింది. 117 సీట్లున్న అసెంబ్లీలో కేవలం 18 సీట్లకు పరిమితమైంది. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అనుకూలంగా మలచుకోవడంలో విఫలమైంది. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లోను పెద్దగా సానుకూల ఫలితాలను పొందలేకపోయింది.

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో జీ23 నేతలు మరోసారి అసంతృప్తికి గురయ్యారు. ఈ నేతల్లో 18 మంది మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడిన నుంచి ఎక్కడో ఓ చోట కలుస్తూనే వున్నారు. ఈగ్రూపుకు ఇంతకాలం దూరంగా వున్న మణిశంకర్ అయ్యర్ లాంటి వారు కూడా ఇందులో చేరారు. పార్టీ అధినేత్రికి తమ ఫీలింగ్స్‌ని చెప్పేందుకు యత్నిస్తునే వున్నారు. ఇంతకాలం వీరిని విస్మరిస్తూ వచ్చిన సోనియా గాంధీ ఎట్టకేలకు తాజా ఫలితాలతో కళ్ళు తెరిచారనే చెప్పాలి. జీ23లో కీలకంగా వ్యవహరిస్తూ వున్న కశ్మీరీ నేత గులాం నబీ ఆజాద్‌కు సోనియా వర్తమానం పంపారు. తనను కలవాల్సిందిగా ఆయనను ఆదేశించారు. ఎట్టకేలకు అధినేత్రి స్పందించడంతో ఆజాద్‌ హుటాహుటిన మార్చి 18వ తేదీన సోనియా గాంధీని కలుసుకున్నారు. పార్టీకి పునర్వైభవం తెచ్చే దిశగా చెపట్టాల్సిన వ్యూహాలను ఇరువురు చర్చించుకున్నట్లు కథనాలు వచ్చాయి. వీరిద్దరి భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులు వచ్చే సంకేతాలు వెలువడ్డాయి. అయితే.. అధ్యక్షురాలి మార్పు తథ్యం అన్న కథనాలపై మాత్రం గులాం నబీ ఆజాద్ భిన్నంగా స్పందించారు. అధ్యక్షున్నిగానీ.. అధినేత్రిని గానీ మార్చాలని తాము కోరుకోవడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఓరకంగా చెప్పాలంటే ఫలితాలు ఎలా వచ్చినా.. గాంధీ కుటుంబ సారథ్యాన్ని తాము కోరుకుంటున్నామని ఆయన పరోక్షంగా తేల్చేశారు. ఈక్రమంలో ఏ రకమైన మార్పుల ద్వారా పార్టీలో పునరుత్తేజం తెచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తారన్నది ఇంకా తేలలేదు. కానీ.. మార్చి 20 తర్వాత కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ నిర్వహణకు మాత్రం మార్గం పడింది. ఈ భేటీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల వ్యూహరచన ఖాయమంటున్నారు. వరుస విజయాలతో దూకుడు మీదున్న భారతీయ జనతా పార్టీని నిలువరించే వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ నేతలు పదునుపెడతారని తెలుస్తోంది. జాతీయతా భావంతో బీజేపీ లబ్ధిపొందుతుందని భావిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు దానికి చెక్ పెట్టేలా వ్యూహాలు రచించేందుకు సిద్దమవుతున్నారు.

దాదాపు ఎనిమిదేళ్ళుగా దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీకి రాఫేల్ మరక అంటించేందుకు కాంగ్రెస్ నేతలు గత అయిదేళ్ళుగా చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ఆరోపణలేవీ మోదీ చరిష్మాని ఏ మాత్రం కరిగించలేకపోయాయి. ఈ నేపథ్యంలో రాఫేల్ డీల్‌ను మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మోదీ పాత్రను ఎండగట్టేందుకు కాంగ్రెస్ నేతలు యత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఓరకంగా చెప్పాలంటే 2024 జనరల్ ఎలెక్షన్స్‌కి ఇదే అంశం కీలకమవుతుందంటున్నారు. మరోవైపు పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు, ఎల్ఐసీ వాటాల విక్రయం, నిరుద్యోగం వంటి సమస్యల ఆధారంగా కాంగ్రెస్ అస్త్రశస్త్రాలకు పదును పెట్టే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా తొలిసారి ఆత్మ పరిశీలనకు, ఆత్మావలోకానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్దమవడం జీ23 నేతలు సాధించిన విజయంగానే పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే.. విధాన నిర్ణయాలలో పార్టీ సీనియర్ల బృందానికి ఏ మేరకు పాత్ర ఇవ్వగలుగుతుంది కాంగ్రెస్ అధిష్టానం అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కుటుంబ పార్టీగా మారిన కాంగ్రెస్‌ను తిరిగి సమిష్టి నాయకత్వం కలిగిన పార్టీగా మారిస్తేనే జీ23 నేతలు సూచిస్తున్న పునర్వైభవం సాధ్యమవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Also read:

Rahul Gandhi: ద్వేషం, కోపం రంగాల్లోనూ భారతదేశానికి త్వరలోనే అగ్రస్థానం.. కేంద్రంపై రాహుల్ వంగ్యాస్త్రాలు!

Mallu Swarajyam: భూస్వాముల కుటుంబాల్లో పుట్టినా.. పేదల పక్షాన 16 ఏళ్లకే తుపాకీ పట్టిన తెలంగాణ వీరనారి

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో భారత ప్రధాని మోడీ భేటీ.. ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ