AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఆ రాష్ట్రంలో ఖాళీ అవుతున్న కేడర్.? బీజేపీలోకి కీలక నేత..

అసలే ఉత్తర్‌ప్రదేశ్.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ముందు ఆ రాష్ట్రాన్ని గెలవాలి. అలాంటి అత్యంత కీలకమైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వానికి ఇంతకాలం కంచుకోట మాదిరిగా నిలిచిన అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకే బీటలు వారుతున్నాయి.

కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఆ రాష్ట్రంలో ఖాళీ అవుతున్న కేడర్.? బీజేపీలోకి కీలక నేత..
Congress
Mahatma Kodiyar
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 13, 2024 | 8:54 PM

Share

అసలే ఉత్తర్‌ప్రదేశ్.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ముందు ఆ రాష్ట్రాన్ని గెలవాలి. అలాంటి అత్యంత కీలకమైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వానికి ఇంతకాలం కంచుకోట మాదిరిగా నిలిచిన అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకే బీటలు వారుతున్నాయి. గత ఎన్నికల్లో ఏకంగా రాహుల్ గాంధీయే ఓటమిపాలయ్యారు. అతికష్టం మీద బయటపడి పరువు నిలబెట్టుకున్న సోనియా గాంధీ ఈసారి మొత్తంగా ప్రత్యక్ష ఎన్నికల నుంచే దూరం జరిగి రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవన్నీ ఇలా ఉండగా.. “ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోయే స్థానాలు ఇవి.. పోటీ చేసే అభ్యర్థులు వీరే” అంటూ ఎవరి పేర్లయితే ప్రచారంలో ఉన్నాయో.. అలాంటివారిలో ఒక కీలక నేత కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన నేతల్లో అజయ్ కపూర్ ఆద్యుడేమీ కాదు. అలాగని అతనితోనే ఈ వలసలు ఆగిపోతాయని కూడా చెప్పలేం. గత దశాబ్దకాలంలో కాంగ్రెస్‌లో జాతీయస్థాయిలో ఉన్న నేతలు సైతం పార్టీని వీడి బీజేపీలో చేరారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న రీటా బహుగుణ జోషి, జితిన్ ప్రసాద వంటి నేతలు ఇప్పుడు ఏకంగా యూపీ కేబినెట్‌లో మంత్రులుగానూ ఉన్నారు. గత రెండేళ్ల వ్యవధిలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతల్లో నాటి యూపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉపేంద్ర సింగ్, వారణాసి మాజీ ఎంపీ రాజేశ్ మిశ్రా, ఆచార్య ప్రమోద్ కుమార్ కృష్ణం వంటి నేతలున్నారు. పార్టీ మారుతున్నవారంతా పదవుల కోసమే చేరుతున్నారు అనుకోవడానికి వీల్లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి గతంలో ఎంపీగా ఉన్న రాజేశ్ మిశ్రా తాను పార్టీ టికెట్ లేదా పదవులు ఆశించి చేరడం లేదని, కేవలం గౌరవం, మర్యాద కోసం మాత్రమే బీజేపీలో చేరానని ప్రకటించారు.

అజయ్ కపూర్ ఎవరు?

ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో టాప్ లీడర్లలో ఒకరు అజయ్ కపూర్. ఏఐసీసీ కార్యదర్శిగా బీహార్ కో-ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సన్నిహితంగా ఉండే నాయకుల్లో అజయ్ కపూర్ ఒకరు. ఒకప్పుడు కాన్పూర్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. కాంగ్రెస్ మాజీ నేత అజయ్ కపూర్ 2002లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించారు. 2002 నుంచి 2017 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. గోవింద్ నగర్ నుంచి రెండుసార్లు, కిద్వాయ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కాన్పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన అనుకున్నారు. యూపీలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు ఉంది. పొత్తుల్లో భాగంగా కాన్పూర్ సీటు కాంగ్రెస్‌కే దక్కింది. టికెట్ రేసులో ఆయనకు అక్కడ పోటీయే లేదు. అయినా సరే.. ఆయన ఇప్పుడు పార్టీని వీడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కాన్పూర్‌లో గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. శ్రీప్రకాష్ జైస్వాల్ ఒక వర్గానికి నేతృత్వం వహిస్తుంటే.. అజయ్ కపూర్ మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. జైస్వాల్ జాతీయస్థాయిలో రాజకీయాలు చేస్తుంటే, కపూర్ రాష్ట్రస్థాయిలో రాజకీయాలు చేస్తూ వచ్చారు. జైస్వాల్ గ్రూప్ బలహీనపడడంతో, కపూర్ జాతీయస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. కాన్పూర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును దాదాపు ఖరారు చేసినట్టుగానే ప్రచారం జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో ఆయన ఏకంగా పార్టీయే మార్చేశారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అజయ్ కపూర్‌కు సమీప బంధువు. కాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా సత్యదేవ్ పచౌరీ ఉన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ 30 శాతం సిట్టింగ్ ఎంపీలను మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తోంది. ఈ క్రమంలో కాన్పూర్ సిట్టింగ్ ఎంపీని మార్చితే.. అజయ్ కపూర్‌ను బీజేపీ నుంచి బరిలోకి దించే అవకాశం ఉంది.

ఇక అజయ్ కపూర్ ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకుంటే.. గత ఎన్నికల్లో ఆయన నామినేషన్ వేసే సమయంలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు దాదాపు రూ. 69 కోట్లు. గత 15 ఏళ్లలో ఆయన సంపద దాదాపు 14 రెట్లు పెరిగిందని కూడా చెబుతున్నారు. 2007లో నామినేషన్ సందర్భంగా ఆయన తన మొత్తం ఆస్తులను రూ.5.28 కోట్లుగా ప్రకటించారు. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ సందర్భంగా ఆయన తన ఆస్తులను రూ.31.39 కోట్లుగా ప్రకటించారు.