
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ బుధవారం ఒక లేఖ విడుదల చేసింది. షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్ని ఎన్నికల్లో టీవీకే పొత్తు ఉంటుందని తెలిపింది. మతవాద శక్తులతో కలిసిపోనంత వరకు తమ మద్దతు ఉంటుందని లేఖలో పేర్కొంది. ఇప్పటివరకు డీఎంకేకు కాంగ్రెస్ మద్దతు ఇస్తూ వస్తోంది. కానీ టీవీకేకు మద్దతు ప్రకటించడంతో డీఎంకేతో కాంగ్రెస్ తెగదెంపులు చేసుకున్నట్లయింది. అధికారం కోల్పోయిన డీఎంకేకు ఇది పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తోంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల మద్దతును టీవీకే కోరుతుంది. కాంగ్రెస్ మద్దతు కోరగా.. ఇవాళ చెన్నైలో కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. టీవీకే మద్దతు ఇవ్వడంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలవగా.. వీళ్లు టీవీకేకు మద్దతు పలకనున్నారు. ఇక సీపీఐ, సీపీఎం, ఇతర స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో విజయ్ ప్రభత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. అటు ఇప్పటికే అన్నాడీఎంకేలో చీలికలు వచ్చాయి. కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దాదాపు 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యే మద్దతు ఇస్తామంటూ టీవీకేను సంప్రదించారు. టీవీకేలో చేరి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కూాడా విజయ్ చర్చలు జరిపారు. అనంతరం కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫలితాల్లో టీవీకే సింగిల్ లాజెస్ట్ పార్టీగా నిలవడంతో విజయ్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌తో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగింది. ఇప్పుడు చివరకు అదే నిజమైంది. అటు విజయ్‌కు అభినందనలు తెలుపుతూ ఇప్పటికే ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. విజయ్ ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు అభివృద్ది విషయంలో సహకారం అందించాలని కోరారు. కాగా విజయ్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఉంటుందని తెలుస్తోంది. ప్రమాణస్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.