Congress Chintan Shivir: రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ చింతన్‌శిబర్ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. చింతన్ శిబిర్ ముగింపు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ. ప్రజలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు తెగిపోయాయని, పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు. ప్రజలకు దగ్గరకు ప్రతి ఒక్కరు వెళ్లాలని కార్యకర్తలకు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ కార్యకర్తలు చెమటోడ్చి పార్టీకి పునర్ వైభవం తేవాలని కోరారు రాహుల్‌గాంధీ. తాను ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నారు. జీవితంలో ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడలేదన్నారు. వ్యవస్థలను కాపాడడం కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరి అభిప్రాయాలకు తగిన గౌరవం లభిస్తుందన్నారు రాహుల్‌గాంధీ. బీజేపీ -ఆర్‌ఎస్‌ఎస్‌లో ఇది ఉండదన్నారు. రానున్న రోజుల్లో అధికధరలు, నిరుద్యోగం మరింత పెరిగే అవకాశముందన్నారు రాహుల్. ఆగస్ట్ 15 నుంచి ఉద్యోగాలు ఇవ్వండి అన్న నినాదంతో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తునట్టు కాంగ్రెస్ ప్రకటించింది.
ఇక సవాళ్లను అధిగమిస్తాం.. ముందుకెళ్లాం.. భారత్ జోడో అనేదే కాంగ్రెస్ నినాదమన్నారు సోనియాగాంధీ. అక్టోబర్ 2వ తేదీన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ప్రారంభిస్తునట్టు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులంతా భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సోనియాగాంధీ.
అంతకుముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 20 తీర్మానాలను సీడబ్లుసీ ఆమోదించింది. ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు. పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయాలన్న జీ 23 ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈవీఎంలను బ్యాన్ చేసి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా ఆమోదించారు. పార్టీ పదవుల్లో 50 శాతం యువతకు భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. అయితే 70 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయరాదన్న ప్రతిపాదనపై మాత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు.