Tripura BJP: త్రిపుర బీజేపీలో చిచ్చు.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన మంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..!
Tripura BJP: త్రిపురలో సీఎం మార్పు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలను బయటపెట్టింది. హైకమాండ్ దూతల ముందే గొడవకు దిగారు బీజేపీ నేతలు. బిప్లవ్‌దేవ్‌ను ..
Tripura BJP: త్రిపురలో సీఎం మార్పు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలను బయటపెట్టింది. హైకమాండ్ దూతల ముందే గొడవకు దిగారు బీజేపీ నేతలు. బిప్లవ్‌దేవ్‌ను తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు మంత్రి రామ్‌ప్రసాద్.
ముఖ్యమంత్రి మార్పు త్రిపుర బీజేపీలో చిచ్చు రేపింది. బిప్లవ్‌దేవ్ స్థానంలో మాణిక్ సాహాను ఎంపిక చేయడంతో పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. బీజేపీ అధిష్టానం భావించినట్టు అధికార మార్పిడి అంత సులువుగా జరగలేదు. బిప్లవ్‌దేవ్ మద్దతుదారులు హైకమాండ్ పరిశీలకుల సమక్షంలోనే నానా హంగామా చేశారు. బిప్లవ్‌దేవ్ నివాసం ఈ గొడవకు వేదికయ్యింది. బిప్లవ్‌దేవ్‌ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు సీఎంగా ఎంపికైన మాణిక్ సాహా. అక్కడే ఉన్న మంత్రి రామ్‌ప్రసాద్ పౌల్ నానా హంగామా చేశారు. ఆయన్ను సముదాయించడానికి చాలా అవస్థలు పడ్డారు బీజేపీ నేతలు. కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత భూపేంద్రయాదవ్ సమక్షం లోనే ఈ గొడవ జరిగింది.
బిప్లవ్‌దేవ్‌ను ఎందుకు సీఎం పదవి నుంచి తొలగించారు.. నేను చచ్చిపోతా అంటూ గట్టిగా నినాదాలు చేశారు రామ్‌ప్రసాద్. డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ వర్మతో అధిష్టానం దూతల ముందే మంత్రి రామ్‌ప్రసాద్ గొడవకు దిగారు. జిష్ణుదేవ్ వర్మ కారణంగానే బిప్లవ్‌దేవ్‌ను సీఎం పదవి నుంచి తొలగించారని రామ్‌ప్రసాద్ ఆరోపించారు.
త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ మాణిక్ సాహాను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. మొన్నీమధ్యే మాణిక్ సాహాను బీజేపీ నాయకత్వం రాజ్యసభకు ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన త్రిపుర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో సాహా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరేళ్ల క్రితమే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు మాణిక్ సాహా. అతి తక్కువ సమయంలో అనూహ్యంగా ఆయన ఉన్నత స్థానానికి చేరారు. త్రిపురకు చెందిన అత్యంత సంపన్న వ్యాపారవేత్త మఖన్ సాహా కుమారుడు మాణిక్ సాహా.
మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్‌ను త్రిపుర బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 8 నెలల గడువు మాత్రమే ఉండడంతో ప్రచార బాధ్యతలను బిప్లవ్‌దేవ్‌కు అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటల కారణంగానే బిప్లవ్‌దేవ్‌ను పార్టీ అధిష్టానం తొలగించినట్టు తెలుస్తోంది. బిప్లవ్‌దేవ్ తీరు వల్లే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీ గూటికి చేరారని ఆయన ప్రత్యర్దులు చెబుతున్నారు.
ఇప్పటికైనా బీజేపీ హైకమాండ్ కళ్లు తెరిచిందని బిప్లవ్‌దేవ్ తొలగింపుపై తృణమూల్ స్పందించింది. ఎన్నికల వేళ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బీజేపీ హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి.
Hooliganism at best!
From Ram Prasad Pal to several other @BJP4Tripura MLAs, Ministers and leaders – breaking into chaos after @BjpBiplab‘s resignation proves once again that the state, under BJP, is headed to its darkest times!#ShameOnBJP pic.twitter.com/VdZ1SW4aRW
— AITC Tripura (@AITC4Tripura) May 14, 2022