AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWC Meet: హాట్‌హాట్‌గా సీడబ్యూసీ సమావేశం.. నాయకత్వ మార్పును కోరుతున్న జీ-23 నేతలు

దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వరుస పరాజయాలు ఆ పార్టీని కుంగదీస్తున్నాయి. దానికి తోడు ఓటమి వెంటనే స్వపక్షీయుల విపరీత వ్యాఖ్యలు మరింత బాధిస్తున్నాయి.

CWC Meet: హాట్‌హాట్‌గా సీడబ్యూసీ సమావేశం.. నాయకత్వ మార్పును కోరుతున్న జీ-23 నేతలు
Cwc Meet
Balu
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 13, 2022 | 12:55 PM

Share

CWC meet: దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) ఇప్పుడు దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వరుస పరాజయాలు ఆ పార్టీని కుంగదీస్తున్నాయి. దానికి తోడు ఓటమి వెంటనే స్వపక్షీయుల విపరీత వ్యాఖ్యలు మరింత బాధిస్తున్నాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో భవిష్యత్తు కార్యాచరణపై అర్జెంట్‌గా చర్చించాలనుకుంది కాంగ్రెకస్‌ వర్కింగ్‌ కమిటీ(Congress Working Committee). పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాందీ అధ్యక్షతన  సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఏం జరగబోతున్నదన్న ఉత్కంఠ ఆ పార్టీలో సర్వత్రా నెలకొంది. ప్రస్తత పరాజయాలపై చర్చించడానికి తక్షణం వర్కింగ్‌ కమిటీని సమావేశపరచాలని గులాంనబీ ఆజాద్‌(Gulab Nabi Azad) వంటి సీనియర్‌ నాయకులు కోరినందుకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు.

పంజాబ్‌లో మరోసారి అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్‌ లక్ష్యం నెరవేరలేదు. గెలిచే అవకాశాలను అంతర్గత విభేదాలు నాశనం చేశాయి. రాహుల్‌గాంధీ ఎంతగా పర్యటించినా, ఎన్ని సమావేశాలలో పాల్గొన్నా ఫలితం లేకుండా పోయింది. కేవలం 18 సీట్లను మాత్రమే గెల్చుకోగలిగింది. ఇక ఉత్తరప్రదేశ్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రియాంకగాంధీ అహర్నిశలూ శ్రమించినా వచ్చినవి కేవలం రెండంటే రెండు స్థానాలు మాత్రమే. మణిపూర్‌, గోవా, ఉత్తరాఖండ్‌లలోనూ ఇదే పరిస్థితి. ఎందుకిలా జరుగుతోంది. ఓటర్లు పదే పదే కాంగ్రెస్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఎక్కడ పొరపాటు జరగుతోంది? దాన్ని సరిదిద్దుకోవడం ఎలా? ఇప్పుడీ ప్రశ్నలకు కాంగ్రెస్‌ నేతలు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు..

ఉత్తరాఖండ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చినప్పటికీ ప్రజలు బీజేపీకే పట్టం గట్టారు. అలాగే ప్రతి అయిదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే ఉత్తరప్రదేశ్‌ ప్రజలు ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు. కాంగ్రెస్‌ విముక్త భారత్‌ తమ ఏకైక లక్ష్యమని చెప్పుకున్న నరేంద్రమోదీ, అమిత్‌షాలు ఇప్పుడు ఆ పనిని దాదాపుగా పూర్తి చేశారు. ఇప్పటికైనా అధినాయకత్వం పటిష్టమైన వ్యూహాలు పన్నకపోతే భవిష్యత్తులో మరిన్ని ఓటములు తప్పవనే భావనలో కేడర్‌ ఉంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పట్నుంచే వ్యూహరచన చేయకపోతే ఆ రెండింటిలోనూ ఓటమి తప్పదేమోనని సీనియర్లు భయపడుతున్నారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు పార్లమెంటరీ వ్యూహ బృందంతో సోనియాగాంధీ సమావేశమవుతారు. రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు.

ఇప్పటి వరకైతే జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీనే! కానీ కాంగ్రెస్‌ గ్రాఫ్‌ ఇలాగే పడిపోతూ ఉంటే మాత్రం ఆ స్థానాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆక్రమించడానికి రెడీగా ఉంది. పంజాబ్‌లో ఆప్‌ విజయానికి కేజ్రీవాల్‌కు ఉన్న ప్రజాదరణ కూడా తోడైన మాట వాస్తవమే అయినప్పటికీ అన్ని రాష్ట్రాలలో ఆప్‌ నెమ్మదిగా అడుగు పెడుతోంది. నిరుడు అక్టోబర్‌లో హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ చెప్పుకోదగ్గ ఓట్లను సాధించగలిగింది. ఇది ఓ రకంగా కాంగ్రెస్‌కు మేలుకొలుపు లాంటిది. ఇప్పటికైనా దివంగత నేత వీరభద్రసింగ్‌ లేని లోటును కాంగ్రెస్‌ భర్తి చేసుకోలేకపోతే ఆప్‌ దూసుకుపోవడం ఖాయం. పంజాబ్‌తో ఆప్‌ సరిపెట్టుకునేలా లేదు. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అధికారంలోకి రావాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. వీటన్నింటినీ పట్టించుకోకుండా, నిర్ధిష్టమైన ప్రణాళికలను రచించుకోకుండా ఉంటే మాత్రం మనుగడ కష్టమే! గత కొద్ది కాలంగా కాంగ్రెస్‌లోని పాతతరం నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గులాంనబీ ఆజాద్‌, కపిల్‌ సిబల్‌, ఆనంద్‌ శర్మ, మనీష్‌ తివారి ఇలా ఓ 23 మంది సీనియర్‌ నేతలు జీ 23గా ఏర్పడ్డారు. యువతరానికి, పాతతరానికి మధ్య అంతరం ఏర్పడింది. పాతతరం నేతలంతా పార్టీ నాయకత్వంలో మార్పులు కోరుకుంటున్నారు. అధినాయకత్వం అనుసరిస్తున్న విధి విధానాలను విమర్శిస్తున్నారు కూడా!

ఇవాళ్టి భేటిలో వీరంతా గట్టి స్వరం వినిపించే అవకాశం ఉంది. మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమవుతుందన్నది విస్పష్టం. ఇప్పటికీ కోటరీ సంస్కృతి కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో సంస్థాగతంగా అనేక మార్పులు చేయాలన్న డిమాండ్‌ ఎప్పట్నుంచో ఉంది.. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని, నియామకాలలో పారదర్శకత ఉండాలని, పార్టీ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని రాహుల్‌ గాంధీ అనుకుంటున్నారు కానీ ఆచరణలో అది సాధ్యపడటం లేదు. కాంగ్రెస్‌లో సమూల మార్పలు అవసరం అనది జీ 23 నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గులాంనబీ ఆజాద్‌ నివాసంలో కొందరు సీనియర్‌ నేతలు సమావేశమయ్యారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఏం చేయాలన్నదానిపై సుదీర్ఘంగా చర్చించారు. అంతర్గత ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తంమీద ఇవాళ జరిగే సీడబ్ల్యూసీ సమావేశం కాంగ్రెస్‌పార్టీలో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.

Read Also….  UP CM Yogi Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న యూపీ సీఎం యోగి.. సాయంత్రం ప్రధానితో భేటీ.. కొత్త మంత్రివర్గ కూర్పుపై చర్చ!