AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Muda Scam: ముడా స్కామ్‌ కేసులో సిద్దరామయ్యకు హైకోర్టు షాక్.. కాంగ్రెస్ సీఎం ఏమన్నారంటే..

కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్‌ గత కొన్ని రోజుల నుంచి సంచలనంగా మారింది.. ముడా స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు జులై 26న గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతించారు.

Muda Scam: ముడా స్కామ్‌ కేసులో సిద్దరామయ్యకు హైకోర్టు షాక్.. కాంగ్రెస్ సీఎం ఏమన్నారంటే..
Cm Siddaramaiah
Shaik Madar Saheb
|

Updated on: Sep 24, 2024 | 5:45 PM

Share

కన్నడ రాజకీయాలలో ముడా స్కామ్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముడా స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు షాకిచ్చింది. గవర్నర్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్ధించింది. దీంతో సీఎం సిద్దరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.

హైకోర్టు నిర్ణయం అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. ముడా స్కాం అంతా బీజేపీ-జేడీఎస్‌ కూటమి కుట్ర అంటూ పేర్కొన్నారు. తన వెనుక కాంగ్రెస్‌ హైకమాండ్‌, కేబినెట్‌ సహచరులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారని అన్నారు. తాను ఎలాంటి విచారణకైనా వెనుకాడబోనని.. ప్రజా తీర్పు కూడా తనవైపే ఉందన్నారు. ఆపరేషన్‌ లోటస్‌తో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ విధానమన్నారు. కోర్టుపై తనకు విశ్వాసం ఉందని, అంతిమంగా ధర్మమే గెలుస్తుందని సిద్దరామయ్య తెలిపారు.

జులై నుంచి.. పొలిటికల్ హీట్

కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్‌ గత కొన్ని రోజుల నుంచి సంచలనంగా మారింది.. ముడా స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు జులై 26న గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతించారు. దీనికి వారం రోజుల్లోగా సంతృప్తికరమైన వివరణలు, సమాధానాలను ఇవ్వాలంటూ ఆదేశించారు. దీన్ని తప్పు పట్టింది కర్ణాటక ప్రభుత్వం. గవర్నర్‌ ఆదేశాలను సవాల్ చేస్తూ గతనెలలోనే సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తాజాగా దీనిపై విచారించిన హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది.

అయితే.. గవర్నర్‌ నిర్ణయాన్ని సీఎం సిద్దరామయ్య తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వ సలహా తీసుకోకుండానే గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. పేదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను ఆపేందుకే బీజేపీ-జేడీఎస్‌ కూటమి తనపై కుట్ర చేసిందన్నారు.

కాగా.. కర్నాటక హైకోర్టు తీర్పుపై స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. సిద్దరామయ్య ఎలాంటి తప్పుచేయలేదని , ఆయన రాజీనామా ప్రసక్తే లేదన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత స్పందించిన మంత్రి రామలింగారెడ్డి సీఎం సిద్ధరామయ్య ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అసలైన అవినీతిపరులు బీజేపీ వాళ్లే అంటూ మండిపడ్డారు.

కాగా.. హైకోర్టు నిర్ణయంపై స్పందించిన బీజేపీ సీఎం రాజీనామా చేయాలని సూచించింది.. ముడా కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని.. కర్ణాటక సీఎం రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. హైకోర్టు నిర్ణయంతోనైనా సీఎం సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేత బీ.వై. విజయేంద్ర డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..