DK Shivakumar: సీఎం సిద్ధరామయ్య భయపడ్డారుకానీ.. నేనైతే తగ్గను.. డీకే శివకుమార్‌ సంచలన కామెంట్స్‌..!

గతంలో సిద్ధరామయ్య సీఎంగా పనిచేసినప్పుడు ఓ ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేశారు.  నిరసనలను చూసి భయంతో ప్రాజెక్టు విషయంలో సిద్ధరామయ్య అప్పట్లో వెనకడుగు వేశారని డీకే శివకుమార్ అన్నారు.

DK Shivakumar: సీఎం సిద్ధరామయ్య భయపడ్డారుకానీ.. నేనైతే తగ్గను.. డీకే శివకుమార్‌ సంచలన కామెంట్స్‌..!
DK Shivakumar, CM Siddaramaiah

Updated on: Jun 28, 2023 | 6:18 PM

బెంగుళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దుమారంరేపుతున్నాయి. డీకే వ్యాఖ్యలు ఇద్దరి మధ్య అంతా సవ్యంగా లేదన్న చర్చకు మళ్లీ ఆజ్యంపోసింది. గతంలో సిద్ధరామయ్య సీఎంగా పనిచేసినప్పుడు ఓ ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేశారు.  నిరసనలను చూసి భయంతో ప్రాజెక్టు విషయంలో సిద్ధరామయ్య అప్పట్లో వెనకడుగు వేశారని డీకే శివకుమార్ అన్నారు. అయితే సిద్ధరామయ్య స్థానంలో తాను ఉండి ఉంటే ఆ నిరసనకు భయపడి వెనకడుగు వేసేవాడిని కానని ఆయన వ్యాఖ్యానించారు. నిరసనలను ఖాతరు చేయకుండా.. ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లేవాడినని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సిద్ధరామయ్యపై డీకే శివకుమార్ చేసిన ఈ కామెంట్స్ వివాదాన్ని రేపుతున్నాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో సామంత రాజైన కెంపెగౌడ జయంతి సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో ఆయన్ను గుర్తు చేసుకుంటూ.. డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో సభలో సిద్ధరామయ్య లేరు.

‘2017లో కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పనిచేస్తున్న కాలంలో బెంగుళూరులో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనలకు భయపడి ఆ ప్రాజెక్టు విషయంలో సిద్ధరామయ్య వెనక్కి తగ్గారు. సిద్ధరామయ్య భయపడ్డారు కానీ.. తానైతే వెనకడుగువేయను.. నిరసనకారుల తాటాకు చప్పుళ్లకు నేను తలొగ్గేవాడిని కాను..’ అంటూ డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేశారు. కాగా రాష్ట్రంలో ఫ్లై ఓవర్ నిర్మాణాలు, టన్నల్స్ నిర్మించాలని తనకు చాలా వినతులు అందాయని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో అక్కడ అధికార పగ్గాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. సీఎం విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో వారి మధ్య రాజీ కుదిరింది. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల వ్యవధిలోనే సిద్ధరామయ్యనుద్దేశించి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

సిద్ధరామయ్యపై డీకే శివకుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు వక్రీకరణకు గురైయ్యాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో మంచి నిర్ణయాలు ఇంకో కారణాలతో వాయిదాపడుతుంటాయని.. డిప్యూటీ సీఎం శివకుమార్ ఆ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. కొన్ని ప్రభుత్వ పనుల విషయంలో కొందరి నుంచి నిరసనలు వ్యక్తమైనప్పుడు ముఖ్యమంత్రులు తమ నిర్ణయాలను మార్చుకోవడం లేదా వాయిదా వేసుకోవడం సహజమేనని అన్నారు.