
సరస్సుల వద్ద కాలక్షేపం చేయటం చాలా మందికి ఎంతో ఇష్టం. మనసు కుదటపడటానికి, కాసింత విశ్రాంతి తీసుకోవడానికి, అందమైన పక్షుల కిల కిలా రాగాలను వినటానికి చాలా మంది పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు సరస్సుల వద్దకు వెళ్తుంటారు. కొన్ని ప్రదేశాలలో సరస్సులు ఉన్నచోట్ల పార్కులు ఏర్పాటు చేసి సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తుంటారు. పర్యాటకులు సైతం పిల్లలు, పెద్దలు అంతా కలిసి వచ్చి ఆయా పార్కుల్లో ఉన్నటువంటి జంతువులు, పక్షులను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, నేటి ఉరుకులు పరుగుల జీవితాల్లో మనుషులకు ప్రశాంతత అనేదే లేకుండా పోయింది. నిత్యం ఒత్తిళ్లలో పనిచేస్తూ చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాల పాలవుతున్నారు. అయితే, ఇలాంటి సమస్యలు వివిధ నగరాలు, పట్టణాల్లోని సరస్సులు కొంతమేరకైనా ఉపశమనం కలిగిస్తున్నాయి. అందుకే దేశంలోని పలు రాష్ట్రాల్లో సరస్సుల అభివృద్ధిపై ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి.
జమ్ముకశ్మీర్‌లోని దాల్, నగీన్ సరస్సులు దేశంలో ఎంతో ప్రాముఖ్యత గల సరస్సులు. ‘శ్రీనగర్ రత్నం’ గా ప్రజాదరణ పొందిన దాల్ సరస్సు కాశ్మీర్ లోయ లోని రెండవ అతిపెద్దది కావటం విశేషం. చుట్టూ చెట్లు మధ్య “వలయం లో రత్నం” అని పిలవబడే నాగిన్ సరస్సు నేడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ సరస్సులలో భారీగా గుర్రపు డెక్క, ఇతర చెత్తా చెదారం పేరుకుపోయింది.ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు దాల్, నగీన్ సరస్సుల క్లీనింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సరస్సుల క్లీనింగ్ కోసం గత కొన్ని రోజులుగా నిత్యం వెయ్యిమంది కూలీలు పనిచేస్తున్నారని జమ్ముకశ్మీర్ లేక్స్ అండ్ వాటర్ వేస్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన అధికారి షబ్బీర్ హుస్సేన్ చెప్పారు.