
ఫిరోజాబాద్, మార్చి 10: యూపీలోని ఫిరోజాబాద్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా గుండెపోటుతో మృతి చెందాడు. చిన్నారి మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ -ఫిరోజాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ -ఫిరోజాబాద్ నగరంలోని నాగ్లా పచ్చియాలో నివాసముంటున్న ధనపాల్ కుమారుడు చంద్రకాంత్ (8) హన్స్ వాహిని పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే శనివారం కూడా స్కూల్‌కు వెళ్లాడు. శనివారం లంచ్ టైంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు. చంద్రకాంత్ కూడా మిగతా పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో చంద్రకాంత్ పరుగెత్తుతూ అకస్మాత్తుగా నడుం చుట్టూ చేతులేసుకుని కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న ఓ చిన్నారి కేకలు వేయడంతో స్కూల్ సిబ్బంది అక్కడికి చేరుకుని.. చిన్నారిని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో టీచర్లు బాలుడిని హుటాహుటీన ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి చంద్రకాంత్ అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి
ఉత్తరప్రదేశ్ -ఫిరోజాబాద్ నగరంలోని హన్స్‌వాహిని పాఠశాలలో శనివారం మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా చంద్రకాంత్(8) అనే బాలుడు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. pic.twitter.com/fsEWKuJLZU
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2024
మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో బాలుడి మరణానికి గుండెపోటు కారణమని వెల్లడైంది. అంత చిన్న వయసున్న బాలుడికి గుండెపోటు రావడం ఏంటని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు కూడా షాక్‌కు గురయ్యారు. పాఠశాల ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల్లో బాలుడు కుప్పకూలిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పెద్దవారిలో గుండెపోటు సంఘటనలు సాధారణం. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలలో కూడా గుండెపోటు సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, థైరాయిడ్ రుగ్మత, ఊబకాయం, ధూమపానం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, అధిక ఒత్తిడి వల్ల కూడా చిన్న పిల్లల్లో గుండెపోటు వస్తుందని చెబుతున్నారు. గుండెపోటు వచ్చే సమయంలో ఛాతీ నొప్పి, ఒత్తిడి, లేదా అసౌకర్యండి అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, భుజాలు, మెడ, దవడ లేదా వెన్ను నొప్పి అనిపించడం, మైకం రావడం, వికారం లేదా వాంతులు.. వంటి లక్షణాల కనిపిస్తాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.