Clashes in Prison: సెంట్రల్ జైలులో గ్యాంగ్ వార్.. అడ్డొచ్చిన జైలు అధికారులపై విచక్షణారహిత దాడి.. ఎక్కడంటే..?
కేరళలోని త్రిసూర్ కేంద్ర కారాగారం. అక్కడ ఎప్పుడూ హై సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి జైలులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నవంబర్ 5 ఆదివారం సాయంత్రం జరిగింది దారుణం. ఘర్షణను అదుపు చేసేందుకు ప్రయత్నించిన జైలు అధికారులపైనా గ్యాంగ్ సభ్యులు తీవ్రంగా దాడి చేశారు.

అది కేరళలోని త్రిసూర్ కేంద్ర కారాగారం. అక్కడ ఎప్పుడూ హై సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి జైలులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నవంబర్ 5 ఆదివారం సాయంత్రం జరిగింది దారుణం. ఘర్షణను అదుపు చేసేందుకు ప్రయత్నించిన జైలు అధికారులపైనా గ్యాంగ్ సభ్యులు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన 10 మంది ఖైదీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
త్రిసూర్ సెంట్రల్ జైల్లో సీపీఎం ముఖ్యనాయకులు టి.పి.చంద్రశేఖరన్ హత్య కేసులో నిందితులైన కోడి సుని గ్యాంగ్ శిక్ష అనుభవిస్తోంది. సీపీఎం పార్టీలో సీనియర్ నేత అయిన చంద్రశేఖరన్ ను 2012 మే 4న సొంత పార్టీ నేతలే హత్య చేయించారు. రాజకీయ కారణాల వల్లే హతమార్చారంటూ ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ కేసులో నిందితులను అరెస్టు చేయగా వారిలో 8 మందికి శిక్ష కూడా పడింది. ఆ ముఠాలోని ఒకరే కోడి సుని. కోడి సుని ముఠా సభ్యులు త్రిసూర్ జైలులో ఒక సమాంతర వ్యవస్థను నడుపుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.. అక్కడ జైలు అధికారుల నిబంధనల కంటే కోడి సుని గ్యాంగ్ రూల్స్ అంటేనే తోటి ఖైదీలకు భయం అన్న తరహాలో ఉంటుందని బయటకు వచ్చిన ఖైదీలు చెబుతుంటారు.
ఇటీవలే తిరువనంతపురంలో సంచలనం సృష్టించిన ఓ హత్య కేసులో తిరువనంతపురంనకు చెందిన ఓ గ్యాంగ్ అరెస్టయింది. ఆ గ్యాంగ్ సభ్యులు కూడా ఇటీవలె త్రిసూర్ జైలులో ఖైదీలుగా ఉంటున్నారు. నవంబర్ 5న కోడి సుని గ్యాంగ్ తిరువనంతపురం హత్య కేసులో నిందితులుగా ఉన్న గ్యాంగ్ మధ్య మాట మాట పెరిగింది. దీంతో రెండు గ్యాంగ్‌ల వాగ్వివాదం చోటు చేసుకుని ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాలు సుమారు గంటకు పైగా పరస్పరం దాడులకు తెగబడ్డారు. దీంతో రంగంలోకి దిగిన జైలు సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తిరువనంతపురం గ్యాంగ్‌ను జైలు కార్యాలయ గదికి తరలించారు. జైలు అధికారులపై తిరగబడిన గ్యాంగ్ ముగ్గురు ఉన్నతాధికారులపై కూడా దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.
అత్యంత భద్రత కలిగిన జైలు అయినప్పటికీ రెండు వర్గాల మధ్య జరిగిన దాడి బీభత్సం అంతా ఇంతా కాదు. కోడి సునీల్ గ్యాంగ్ జైలులో చేసే దౌర్జన్యాలపై వస్తున్న ఆరోపణలకు ఈ ఘటన మరింత ఊతాన్నిస్తోంది. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని జైళ్ల శాఖ నియమించింది. రెండు వర్గాల మధ్య మళ్లీ ఘర్షణ తలెత్తే అవకాశం ఉన్నందున ఒక గ్యాంగ్‌ను మరో జైలుకు తరలించడం మంచిదని జైళ్ల శాఖ అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి …