
లెక్కలు చెప్పాల్సిందే అంటోంది ప్రభుత్వం.. మీకు సంబంధం లేదంటోంది ఆలయ దీక్షితుల వర్గం .. చిదంబరం ఆలయం లెక్కలపై దశాబ్ద కాలంగా ఆలయ అర్చక బృందానికీ, ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్న వివాదం. తాజాగా మద్రాసు హైకోర్టు దీక్షితుల వర్గానికి నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. చిదంబరం నటరాజస్వామి ఆలయ సంపద వివరాలు, ఆదాయం , ఖర్చుకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాలని గత ఏడాది ప్రభుత్వం నోటీసులను పంపించడంపై దీక్షితుల వర్గం తప్పుపట్టాయి. నటరాజస్వామి ఆలయ సంపద ఫై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2014 సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆలయానికి సంబంధించిన పూర్తి హక్కులు తమవేనని దీక్షితులవర్గంవారు చెబుతున్నారు. దేవాదాయ శాఖ ఉత్తర్వులను ఖండిస్తూ రాష్ట్రపతి , ప్రధానికి, రాష్ట్ర గవర్నర్ కి ఆలయ దీక్షితులు ఇప్పటికే ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
నటరాజస్వామీ ఆలయం విషయం లో ప్రభుత్వ ప్రమేయాన్ని తాము ఒప్పుకోమనీ, ఆలయ సంపద విషయంలో ప్రభుత్వంతో ఎంతటి పోరాటానీకైనా తాము సిద్ధమంటూ దీక్షితుల వర్గం హెచ్చరికలు జారీ చేశారు. గత నాలుగు నెలలుగా స్తబ్దుగా ఉన్న వివాదం తాజాగా మద్రాస్ హైకోర్టు నోటీసులతో చర్చనీయాంశంగా మారింది. ఆలయ నిర్వహణ, ఆస్తులు, ఆదాయం , భక్తుల పట్ల దీక్షితుల వర్గం చూపిస్తున్న వివక్ష పట్ల తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆలయానికి వచ్చే ఆదాయం లెక్కలతోపాటు భక్తులకు దర్శన విషయాల్లో ఆంక్షలు పెట్టడంపై భక్తుల్లో వ్యతిరేకత వస్తోందన్న అభిప్రాయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ప్రభుత్వం. నటరాజస్వామి ఆలయం మూల విరాట్టు వెనుక వైపు నుంచి దర్శించుకునే అవకాశం ఉంది. దానినే ఆరుద్ర దర్శనం అంటారు. ఈ ఆరుద్ర దర్శనం దీక్షితులు, వారి కుటుంబ సభ్యులకు తప్ప సామాన్యులకు అవకాశం ఇవ్వడం లేదు. ఈమేరకు ప్రభుత్వ పిటిషన్ వేసింది. దీంతో విచారణకు స్వీకరించిన హైకోర్టు చిదంబరం ఆలయం నిర్వహణ చేపడుతున్న దీక్షితులకు నోటీసులు జారీచేసింది. నాలుగేళ్లుగా ఆలయానికి వచ్చిన ఆదాయం తాలుకు వివరాలు, ఆరుద్ర దర్శనం అమలు కు సంబంధించిన పూర్తి వివరాలు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వ తీరును దీక్షితుల వర్గం తప్పుబడుతోంది.