ఓ తల్లి తన బిడ్డ కోసం ఏదైనా, ఎంతటి సాహసానికైన సిద్ధపడుతుందని తెలుసు. పిల్లలకు ఏదైనా అపాయం వస్తుందని తెలిస్తే.. ఆమె మరణంతో కూడా పోరాడగలదు. ఈ కథ ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో మరోమారు నిజమైంది. ఇక్కడ ఓ తల్లి తన 11 ఏళ్ల కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు మృత్యువుతో పోరాడింది. ఆమె కుమార్తెపై ఒక అడవి పంది దాడి చేసింది..దాంతో ఆ తల్లి అడవి పందిని ఎదిరించి తన కూతుర్ని కాపాడుకుంది. అయితే అడవి పందితో పోరాడే క్రమంలో ఆమె మరణించింది. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని పాసన్ పోలీస్ స్టేషన్ పరిధి తెలియమార్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల దువాషియా బాయి, ఆదివారం 11 ఏళ్ల కుమార్తెతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో మట్టి తీసే పనులు చేస్తుండగా హఠాత్తుగా వచ్చిన అడవిపంది ఆమె కుమార్తెపై దాడి చేయబోయింది. అది గమనించిన దువాషియా బాయి వెంటనే తన చేతిలో ఉన్న గొడ్డలితో ప్రతిఘటించింది. ఆ అడవి పందితో తీవ్రంగా పోరాడింది. దీంతో అది చనిపోయింది. కాగా, అడవి పందితో పోరాటంలో తీవ్రంగా గాయపడిన దువాషియా బాయి కూడా చనిపోయింది.
గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రూర మృగాల దాడి కింద బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని పాసన్ అటవీ రేంజ్ అధికారి రామ్‌నివాస్ దహయత్ తెలిపారు. తాత్కాలిక ఉపశమనం కింద తొలుత రూ.25,000 చెల్లిస్తామని, అన్ని ఫార్మాటీలు ముగిసిన అనంతరం మిగతా రూ.5.75 లక్షలు అందజేస్తామని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..