చత్తీస్‌గఢ్, సెప్టెంబర్ 16: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి, క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురు మహిళలతోసహా ఐదురుగురిని గ్రామస్థులు దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటన కొంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏక్తాల్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతులను మౌసం కన్న (34), మౌసం బిరి, మౌసం బుచ్చా (34), మౌసం అర్జో (32), కర్కా లచ్చి (43), 11-నెలల కుమారుడు యష్గా గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు, ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని ఐదుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న సుక్మా జిల్లా ఇక్తాల్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లా నుంచి సెప్టెంబర్ 13న ఇద్దరు దంపతులను, మరో ఇద్దరు మహిళను తీసుకొచ్చి గ్రామస్థులంగా దారుణంగా హింసించి, చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఓ చిన్నారి కూడా మరణించింది. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. ఇద్దరు దంపతులు, భర్త ఇద్దరు సోదరీమణులు, చిన్నారిని సుత్తి, పదునైన ఆయుధాలతో కొట్టి చంపారు. ఆ గ్రామస్థులకు చేతబడి చేస్తున్నారనే అనుమానం కలగడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పసికందుతో సహా ఛిద్రమైన మృతదేహాలను చూసి నివ్వెరపోయారు. ఈ ఘటన రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని బలోడా బజార్ ఎస్పీ విజయ్ అగర్వాల్ చెప్పారు.
బాధితులు చేతబడి చేస్తున్నారనే అనుమానంతో కుటుంబంపై దాడి చేశారని తెలిపారు.ఈ హత్యలు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కస్డోల్‌లోని ఛార్‌చెడ్ గ్రామంలో జరిగాయి. వీరందరినీ సుత్తి, పదునైన ఆయుధాలతో దారుణంగా కొట్టి చంపారు. ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో అదే కుటుంబానికి చెందిన వృద్ధురాలు ప్రాణాలతో బయటపడిందని ఎస్పీ విజయ్ అగర్వాల్ తెలిపారు. కాగా మూడు రోజుల క్రితం ఇదే విధమైన ఘటన భాతపరా జిల్లాలో చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు.