కట్నం లేకుండా పెళ్లి.. కానీ అసలు నిజం వేరే.. ఫస్ట్ నైట్ రోజే భార్యను దారుణంగా..
చెన్నైలో మ్యాట్రిమోనియల్ ద్వారా కుదిరిన వివాహం తొలి రాత్రే విషాదంగా మారింది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన వధువు కలలు అన్ని కల్లలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆ రాత్రి భార్యాభర్తల మధ్య ఏం జరిగింది.. భర్త ఎందుకు దాడి చేశాడు.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా కుదిరిన వివాహం.. రెండు కుటుంబాల సంతోషం.. క్షణాల్లో విషాదంగా మారింది. పెళ్లైన తొలి రాత్రి, భార్య శారీరక సంబంధానికి నిరాకరించడంతో ఆగ్రహించిన భర్త సుత్తితో ఆమెపై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. ఈ దారుణ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని పురసైవాక్కం పార్థసారథి వీధిలో నివసించే అగస్టిన్ జాషువాకు, తిరువళ్లూరుకు చెందిన 24 ఏళ్ల యువతికి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమై పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయమైంది. కట్నం లేకుండా వివాహం చేసుకోవాలనే జాషువా నిర్ణయంతో వధువు కుటుంబం సంతోషంగా పెళ్లికి అంగీకరించింది. నవంబర్ 23న వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అన్ని ఆచారాలు, సంప్రదాయాలు పూర్తయిన తర్వాత నూతన వధూవరులను జాషువా ఇంటికి తీసుకువచ్చారు. వారిని కుటుంబ సభ్యులు హృదయపూర్వకంగా స్వాగతించారు.
బెడ్‌రూమ్‌లో మొదలైన ఘర్షణ
వివాహం తర్వాత తొలి రాత్రి, వరుడు జాషువా, వధువు బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. పెద్దలు కుదిర్చిన వివాహం కావడంతో వధువు ముందుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని, పరస్పర అవగాహన పెంచుకోవాలని కోరుకుంది. అయితే వరుడు జాషువా వెంటనే శారీరక సంబంధం పెట్టుకోవాలని పట్టుబట్టాడు. ముందు ఒకరినొకరు అర్థం చేసుకుందాం అని వధువు సున్నితంగా నిరాకరించింది. ఇది జాషువాకు ఏ మాత్రం నచ్చలేదు. మొండిగా ఉన్న వధువు తీరుతో జాషువాకు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో మరో గది నుండి సుత్తి తీసుకొచ్చి.. భార్యపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన ఆ వధువు రక్తపు మడుగులో పడిపోయింది. ఆమె చనిపోయిందని భావించిన జాషువా అక్కడి నుండి పరారయ్యాడు. ఉదయం వధువు అత్తమామలు గదిలోకి వెళ్లి రక్తపు మడుగులో పడి ఉన్న తమ కోడలిని చూసి దిగ్భ్రాంతి చెందారు. ఆమెను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
చాలామంది మహిళలతో
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ సంఘటన తర్వాత జాషువా గురించి కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాననడం వల్లే జాషువాను నమ్మాను. కానీ పెళ్లి రాత్రి అతని నిజ స్వరూపం తెలిసింది. తన భర్తకు చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ వధువు పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపింది. పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు అగస్టిన్ జాషువా కోసం గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




