Covid-19 Surge Post Holi Celebrations: దేశంలో కరోనా థర్డ్ వేవ్ తర్వాత కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని వారాలుగా కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మూడు వేలకు దిగువన కేసులు, 100 లోపు మరణాలు నమోదవుతున్నాయి. దాదాపు 667 రోజుల తర్వాత కేసుల సంఖ్య అత్యల్పంగా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. సోమవారం 2,503 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే.. దేశంలో పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది. కేసులు తగ్గుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు, పరిమిత సమావేశాలు లాంటి అన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయాలని, అంతర్-రాష్ట్ర కదలికలను నియంత్రించవద్దని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశించింది. థర్డ్ వేవ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లోనే ఆంక్షలు విధించగా.. కేసులు క్రమంగా తగ్గడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలను ఎత్తివేశాయి. అయితే.. మార్చి 18న హోలీ జరగనుంది. రంగుల పండుగ వేడుకలు దేశంలో మళ్లీ కేసుల పెరుగుదలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఒకే చోట గుమిగూడటం, భారీ సమూహాల కారణంగా కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
కొంతమంది శాస్త్రవేత్తల నివేదికల ప్రకారం.. జూన్-జూలైలో మరొక కరోనా వేవ్ రావొచ్చని పేర్కొంటున్నారు. అయితే వైరాలజిస్టులు మాత్రం ఇది ఒక ఊహ మాత్రమేనని, అలా జరగదంటూ కొట్టిపారేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా SARS-CoV 2 వ్యాప్తి తుది దశకు చేరుకుందని ప్రకటించడానికి సిద్ధంగా లేదు. దక్షిణాసియాలో చైనా, దక్షిణ కొరియా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నందున, ప్రత్యేకించి హోలీ వంటి పండుగ సమయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా వేడుకలు జరుపుకోవడం అనేది ఆందోళన కలిగిస్తోంది. గతేడాది హోలీ పండుగ సందర్భంగా కేసులు ఎక్కువగా పెరగడంతో విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 22 కింద ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
హోలీ వేడుకలు మరో వేవ్‌కు కారణమవుతాయా..?
ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్, పల్మోనాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవి శేఖర్ ఝా దీనిపై మాట్లాడుతూ.. శాస్త్రీయ ఆధారాల ఆధారంగా హోలీ తర్వాత మరొక కోవిడ్ వేవ్ రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. గత సంవత్సరంలా కోవిడ్ పెరుగుదల ఉండదన్నారు. థర్డ్ వేవ్ మధ్య హోలీ తర్వాత వెంటనే కేసులు ఆ స్థాయికి పెరిగే అవకాశం లేదని ఆయన న్యూస్9 తో (News9) పేర్కొన్నారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్నామని.. ఒక వేవ్ నుంచి తదుపరి వేవ్ ప్రారంభానికి దాదాపు 4 నెలల సమయం పడుతుందని గమనించినట్లు పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్ 2021 నుంచి వైరస్ వ్యాప్తి భారీగా పెరిగి సెకండ్ వేవ్ తర్వాత ముగిసిందన్నారు. ఇది హోలీ తర్వాత జరిగిందని.. రెండవ వేవ్ తర్వాత మూడవ వేవ్ రావడానికి దాదాపు 4 నెలల సమయం పట్టిందని పేర్కొన్నారు.
దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. హోలీ వేడుకలు మరో వేవ్‌గా మారే అవకాశాలు చాలా తక్కువని ఆయన పేర్కొన్నాయి. SRL డయాగ్నోస్టిక్స్ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ సిమి భాటియా కూడా మరో వేవ్ అసంభవమని కొట్టిపారేశారు. కేసుల సంఖ్య తక్కువగా ఉండటం.. మెజారిటీ రాష్ట్రాల్లో పాజటివిటీ రేటు దాదాపు 5 శాతం కంటే తక్కువగా ఉన్నందున కరోనా పెరుగుదల ఉండదని పేర్కొన్నారు. అయితే.. ఇంకా జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
ఉత్సవాల సమయంలో సామూహిక వేడుకలకు అనుమతించవచ్చా..?
హోలీ తర్వాత మరొక వేవ్‌కు అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రజలు వేడుకల్లో భాగంగా భారీగా గుమిగూడటం అంత మంచిది కాదని డాక్టర్ ఝా పేర్కొన్నారు. ఎందుకంటే కరోనా వేరియంట్‌లు ఇంకా ప్రభలే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా నుంచి పూర్తిగా బయటపడలేదని గుర్తుచేశారు. హోలీని ఎక్కువగా నీటితో ఆడతారు.. ఇది సైనస్ అలర్జీలను ప్రభావితం చేస్తుందన్నారు. గతంలో గుర్తించిన ఇలాంటి కేసులు ప్రాణాంతకమని నిరూపించాయన్నారు. అలాంటి వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే అవకాశముందన్నారు. కోవిడ్-19 వ్యాప్తి ఇంకా ఉన్న నేపథ్యంలో హోలీ వేడుకల తర్వాత.. లక్షణరహితంగా ఉన్నప్పటికీ జలుబు, తుమ్ములు లాంటి అనారోగ్య పరిస్థితులు (ఇతర ఫ్లూ-వంటి లక్షణాలు) తలెత్తవచ్చన్నారు. దాదాపుగా సామూహిక వేడుకలు నివారిస్తే మేలని సూచించారు.
ఇలాంటి పరిస్థితుల్లో హోలీని జరుపుకోవాలని నిర్ణయించుకుంటే.. పొడి, సేంద్రీయ రంగులతో ఆడుకోవచ్చని సూచించారు. నీటితో వేడుకలకు దూరంగా ఉండాలని సూచించారు. సామూహిక వేడుకలు జరగకుండా చూసుకోవడంలో ప్రభుత్వం తన వంతు పాత్రను సైతం పోషించాలని కోరారు. ఈ దశలో అన్ని ఆంక్షలను ఎత్తివేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ హనీ సావ్లా మాట్లాడుతూ.. జనాభాలో ఎక్కువ మంది ఇప్పుడు పూర్తిగా టీకాలు వేయించుకున్నారని.. కనీసం ఒక డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ని తీసుకున్నారని పేర్కొన్నారు. దీని వల్ల భారతదేశంలో మరో వేవ్ వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో 90 శాతం మంది మొదటి డోస్‌ను తీసుకున్నారని.. 80 శాతం మంది పూర్తిగా టీకాలు వేయించుకున్నారన్నారు. ఇంకా ప్రికాషనరీ డోసులు అందుతున్నాయన్నారు. కావున ఇప్పుడు ఆంక్షలపై అంతలా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు సాధారణ పరిస్థితికి తీసుకురావడం గురించి మాత్రమే ఆలోచించాలని ఆమె సూచించారు. వైరస్‌తో జీవించడం నేర్చుకోవాలని.. కోవిడ్‌కు ముందు ఉన్నట్లే తిరిగి సాధారణ జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు.
పరిశోధకుల హెచ్చరిక..
SARS-CoV-2 వైరస్ వేరియంట్‌లు ఇప్పటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అన్ని పరిమితులను ఎత్తివేయవద్దంటూ హెచ్చరిస్తున్నారు. COVID-19 క్షీణత అంతగా లేదని.. కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్‌పై అప్పుడే విజయం సాధించలేదని.. ఇంకా ప్రమాదం పొంచిఉందని హెచ్చరికలు చేస్తున్నారు. కేసులు భారీగా తగ్గినప్పటికీ.. ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
చాలా త్వరగా ఆంక్షలు ఎత్తివేడం వల్ల కేసుల పెరుగుదలకు దారితీయవచ్చని.. అదికాస్త మరో వేవ్‌కు కారణమవుతుందని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జాన్ బ్రౌన్‌స్టెయిన్ తెలిపారు. హోలీ వల్ల మరో కోవిడ్ వేవ్ అసంభవమని నిపుణులు వాదిస్తున్నప్పటికీ.. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. హోలీ ఉత్సవాలు జరుపుకోండి.. ఆనందించండి.. నీటితో కాకుండా సేంద్రీయ, పొడి రంగులతో ఆడుకోండి.. భారీ జనసమూహాలకు దూరంగా ఉండండి అంటూ డాక్టర్ ఝా సూచించారు.
Also Read: