సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా పైరసీ మాత్రం ఆగడం లేదు. దీంతో పైరసీకి ఎలాగైనా చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా పైరసీ చేసేవారికి మూడేళ్ల జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. అంతేకాకుండా సినిమా నిర్మాణం వ్యయంలో 5 శాతం జరిమానాగా విధించే సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు – 2023ను తీసుకొచ్చింది. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఇదిలా ఉంటే ఈ బిల్లును ఇది వరకే రాజ్య సభ ఆమోదించింది.
రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాక ఇది చట్టపరంగా మారనుంది. బిల్లు ఆమోదం సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ మాట్లాడుతూ.. మన సినిమా ఇండస్ట్రీకి ఈ రోజు ఎంతో చారిత్రాత్మకం అని అన్నారు. క్యాన్సర్‌లాంటి పైరసీని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ బిల్లు తెచ్చినట్లు ఆయన అభివర్ణించారు. పైరసీని అరికట్టేందుకు కఠినమైన కొత్త సెక్షన్లను చట్టంలో జోడించామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారన్న మంత్రి.. సినిమా, టీవీ కంటెంట్‌ను ఇక నుంచి వయసులవారీగా వర్గీకరిస్తున్నామని తెలిపారు. యూఏ కేటగిరీలో యూఏ 7ప్లస్, యూఏ 13ప్లస్, యూఏ 16ప్లస్‌గా విభజిస్తూ సెన్సార్ సర్టిపికెట్ ఇవ్వనున్నామని తెలిపారు.
A Historic Day For Our Film Industry!
After the successful passage of The Cinematograph (Amendment Bill) 2023 in the Rajya Sabha, the bill also got passed in the Lok Sabha.
India is known as the country of story-tellers and has the distinction of producing the highest number of… pic.twitter.com/wv5M8Sq6tS
— Anurag Thakur (@ianuragthakur) July 31, 2023
పాత చట్టం ప్రకారం సెన్సార్ సర్టిఫికెట్ 10ఏళ్ల వరకే చెల్లుబాటు అయ్యేదని, కొత్త బిల్లు చట్టంగా మారాక సెన్సార్ సర్టిఫికెట్ శాశ్వతంగా చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. మన సినిమాలు మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయన్నారు. సినిమా పరిశ్రమ ఎదగడానికి, వేలాది మందికి ఉపాధి లభించేందకు ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..