Mobile Apps: ఉగ్రవాదులు ఉపయోగించే మొబైల్ యాప్స్ ఇవే.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌తో మోడీ సర్కార్ కీలక నిర్ణయం..
మొబైల్ యాప్స్‌నకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన 14 మెసెంజర్ యాప్స్‌ను బ్లాక్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాదులు.. వారి మధ్య సమాచారం చేరవేసుకునేందుకు ఈ యాప్స్ దోహదపడుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి సమాచారం ఇచ్చాయి.

మొబైల్ యాప్స్‌నకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన 14 మెసెంజర్ యాప్స్‌ను బ్లాక్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాదులు.. వారి మధ్య సమాచారం చేరవేసుకునేందుకు ఈ యాప్స్ దోహదపడుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి సమాచారం ఇచ్చాయి. దీంతో ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69ఏ ప్రకారం ఆ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన యాప్స్ జాబితాలో.. Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO, Element, Second line, Zangi, Threem (క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్‌స్విస్, విక్రమ్, మీడియా ఫైర్, బ్రియర్, బీఛాట్, నాన్డ్‌బాక్స్, కొనియన్, ఇమో, ఎలిమెంట్, సెకండ్‌లైన్, జంగి, త్రీమా) లాంటి మొబైల్ యాప్స్ ఉన్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి, అలాగే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల మధ్య సమాచారాన్ని చేరవేసేందుకు ఎక్కువగా ఈ 14 మెసెంజర్ మొబైల్ అప్లికేషన్‌లను వినియోగిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మూలాల ప్రకారం ఈ మొబైల్ అప్లికేషన్‌లను కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు తమ మద్దతుదారులు, ఆన్-గ్రౌండ్ వర్కర్లతో (OGW) కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించారని నిర్ధారించారు. పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాదులు ఈ యాప్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
“ఓవర్‌గ్రౌండ్ వర్కర్లు (OGWs), ఉగ్రవాదులు తమలో తాము కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ఈ ఛానెల్‌లను ఉపయోగించడాన్ని ఏజెన్సీలు ట్రాక్ చేశాయని ఓ అధికారి తెలిపారు. ఆ తర్వాత, లోయలో పనిచేస్తున్న ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సహాయంతో, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే, భారతీయ చట్టాలను పాటించని యాప్‌ల జాబితాను సిద్ధం చేశారు.
తీవ్రవాదం, తీవ్రవాద ప్రచారం, సమాచార మార్పిడికి కీలకంగా మారిన ఈ మొబైల్ అప్లికేషన్‌ల జాబితాను హోమంత్రిత్వ శాఖకు సమర్పించడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69A కింద బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన మొబైల్ అప్లికేషన్లపై కేంద్రం కొన్నేళ్లుగా చర్యలు తీసుకొంటున్న విషయం తెలిసిందే.




