Agnipath: ప్రస్తుతం దేశమంతా అగ్నిపథ్ అంశంపైనే చర్చ జరుగుతోంది. ఆర్మీ నియామకాల్లో నూతన విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానంపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్న విషయం తెలిసిందే. ఈ విధానానికి కొంతమంది మద్ధతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం దేశ వ్యాప్తంగా బంద్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మక సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే.
ఈ అల్లర్లకు ప్రధాన కారణం వాట్సాప్ అనే వాదనలు వినిపించాయి. నర్సరావుపేటకు చెందిన సుబ్బారావు అనే ఇన్‌స్టిట్యూట్ యజమాని ‘హకీమ్‌పేట్ ఆర్మీ సోల్జర్స్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నిరుద్యోగులను నిరసనల్లో పాల్గొనమంటూ ప్రేరేపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వాట్సాప్ గ్రూప్‌లపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా తాజాగా కొన్ని వాట్సాప్ గ్రూప్‌లను నిషేధించింది.
అగ్నిపథ్ వ్యతిరేక అల్లర్లకు ప్రధాన ఆయుధంగా అనుమానిస్తున్న 35 వాట్సాప్ గ్రూప్‌లపై ఆదివారం నిషేధం విధించారు. అలాగే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, హింసను ప్రేరేపించడంలో పాల్గొన్న వ్యక్తులను ప్రభుత్వం గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే పది మందిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని అగ్నిపత్ పథకం సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..