AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CEC: ఈ లోక్ సభ ఎన్నికలు మహిళా శక్తికి నిదర్శనం.. సీఈసీ రాజీవ్ కుమార్..

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యింది. కౌంటింగ్‌ను చాలా పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈవిషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు సీఈసీ రాజీవ్‌కుమార్‌. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 543 స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్‌ సందర్భంగా ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది.

CEC: ఈ లోక్ సభ ఎన్నికలు మహిళా శక్తికి నిదర్శనం.. సీఈసీ రాజీవ్ కుమార్..
Eci Rajeev Kumar
Srikar T
|

Updated on: Jun 03, 2024 | 9:19 PM

Share

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యింది. కౌంటింగ్‌ను చాలా పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈవిషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు సీఈసీ రాజీవ్‌కుమార్‌. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 543 స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్‌ సందర్భంగా ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది. బెంగాల్‌తో సహా పలు సమస్యాత్మక నియోజకవర్గాల్లో పారామిలటరీ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి పటిష్ఠంగా, గడియారంలా కచ్చితత్వంతో పనిచేస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లెక్కింపు ప్రక్రియలో ఎక్కడా తప్పిదాలకు తావులేదని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపట్టడానికి ముందే పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరుగుతుందని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలైన అరగంటకు EVM ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. 2019లో ఇలాగే జరిగిందని, 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని, నిన్న ఆరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ ఓట్ల లెక్కింపులోనూ ఇదే జరిగిందని అన్నారు. గతంతో పోల్చితే ఈ దఫా ఎన్నికల్లో రీపోలింగ్‌ చేపట్టాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కేవలం 39 పోలింగ్‌ కేంద్రాల్లోనే ఈసారి రీపోలింగ్‌ జరిగిందని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. ఈ 39లో కూడా 25 రీపోలింగ్‌ కేంద్రాలు రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపారు. 2019 ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్‌ జరిగిందని ఆయన గుర్తు చేశారు. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పోలింగ్‌ ఈసారి జమ్ము కశ్మీర్‌లో నమోదైందని తెలిపారు. ఈ ఎన్నికల్లో 64 కోట్ల 20 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది.

ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో మహిళలు 31 కోట్ల 20 లక్షలున్నారు. మహిళా శక్తికి ఇది నిదర్శనమని ఈసీ కృతజ్ఞతలు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో 10వేల కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు సీఈసీ వెల్లడించారు. 2019 ఎన్నికలతో పోల్చితే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఈ దఫా ఎన్నికల నిర్వహణలో ఎండల తీవ్రత బాగా ప్రభావం చూపిందని చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఎండలు తీవ్రం కావడానికి ముందే ఎన్నికలు నిర్వహిస్తే మంచిదనే పాఠం ఈసారి తాము తెలుసుకున్నామని అన్నారు. భారత్‌లో ఎన్నికలు ఒక అద్భుతమని, దీనికి సరిసమానమైనది ప్రపంచంలో మరొకటి లేదని రాజీవ్‌ కుమార్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..