హత్రాస్ కేసు, స్వర భాస్కర్, దిగ్విజయ్ సింగ్ లపై మహిళా కమిషన్ చర్య ?
హత్రాస్ కేసులో బాధితురాలి ఐడెంటిటీని సోషల్ మీడియాలో షేర్ చేసినవారందరిపైనా జాతీయ మహిళా కమిషన్ తీవ్ర చర్య తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో నటి స్వర భాస్కర్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్..
హత్రాస్ కేసులో బాధితురాలి ఐడెంటిటీని సోషల్ మీడియాలో షేర్ చేసినవారందరిపైనా జాతీయ మహిళా కమిషన్ తీవ్ర చర్య తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో నటి స్వర భాస్కర్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ కూడా ఉన్నారు. ఐపీసీ (భారత శిక్షాస్మృతి) ప్రకారం, రేప్ కు గురైన బాధితురాలి పేరును గానీ, ఆమె వివరాలను గానీ వెల్లడించడం నిషేధం. స్వర భాస్కర్, దిగ్విజయ్ సింగ్, మాలవీయ తదితరులు సోషల్ మీడియాలో హత్రాస్ బాధితురాలి ఐడెంటిటీని పేర్కొన్నారని, మరికొంతమంది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రస్తావించారని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు. అసలు హత్రాస్ బాధితురాలిపై అత్యాచారం జరిగిందా అన్న విషయాన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్ స్పష్టం చేయలేదని, ఒకవేళ జరిగినట్టు ధృవీకరిస్తే..వీరందరికీ నోటీసులు జారీ చేస్తామని ఆమె చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి ఫోటోలు పెట్టిన ప్రతివారి వివరాలు తమవద్ద ఉన్నాయని ఆమె వెల్లడించారు. బాధితురాలిపై అమిత్ మాలవీయ ఈ నెల 2 న ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఇది తీవ్ర సంచలనానికి దారి తీసింది. ఆయనపై కఠిన చర్య తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.