Uttar Pradesh: అందరి చూపు ఆమె పైనే.. ఏ గట్టున ఉంటారో తెలియక తికమక

దేశంలోని రాజకీయ పార్టీలు రెండు గ్రూపులుగా చీలిపోయాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని 'నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్' (NDA) కాగా మరొకటి కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్' - I.N.D.I.A. ఎన్డీఏ కూటమిలో బీజేపీ మినహా బలమైన ప్రాంతీయ పార్టీ ఏదీ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే కనీసం ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో సైతం కనీసం ప్రాతినిథ్యం లేని రాజకీయ పార్టీలు ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నాయి.

Uttar Pradesh: అందరి చూపు ఆమె పైనే.. ఏ గట్టున ఉంటారో తెలియక తికమక
Mayavathi
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Srikar T

Updated on: Jan 09, 2024 | 6:56 AM

దేశంలోని రాజకీయ పార్టీలు రెండు గ్రూపులుగా చీలిపోయాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్’ (NDA) కాగా మరొకటి కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్’ – I.N.D.I.A. ఎన్డీఏ కూటమిలో బీజేపీ మినహా బలమైన ప్రాంతీయ పార్టీ ఏదీ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే కనీసం ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో సైతం కనీసం ప్రాతినిథ్యం లేని రాజకీయ పార్టీలు ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నాయి. కానీ I.N.D.I.Aలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), డీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు కూటముల్లో ఎటువైపూ లేకుండా తటస్థంగా ఉన్న మరికొన్ని బలమైన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. అలాంటి పార్టీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైఎస్సార్సీపీ (YSRCP), తెలుగుదేశం (TDP), భారత రాష్ట్ర సమితి (BRS), బిజూ జనతాదళ్ (BJD)తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) వంటి పార్టీలున్నాయి.

బీజేపీ ఓటమే ఏకైక లక్ష్యంగా జట్టుకట్టిన విపక్ష కూటమి (I.N.D.I.A)లో ఈ పార్టీలు చేరకపోవడంతో పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నాయన్న విమర్శలు సైతం ఎదుర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష కూటమి నేతలు ఆ విమర్శలు పక్కనపెట్టి తమ బలాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా విపక్ష కూటమిలో చేరే అవకాశం లేదు. ఒడిశాలో బీజేడీ కూడా అంతే. కానీ ఎంపీ సీట్ల లెక్కలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీని వదులుకోడానికి విపక్ష కూటమి సిద్ధంగా లేదు. ఇందుక్కారణం ఇప్పటికీ ఆ రాష్ట్రంలో దళిత, బడుగు, బలహీన బహుజన వర్గాల్లో ఇప్పటికీ మాయావతి ప్రభావం ఉండడమే. కేవలం యూపీలోనే కాదు, దేశవ్యాప్తంగానూ అన్ని రాష్ట్రాల్లో బీఎస్పీకి యంత్రాంగం ఉంది. ఎంతో కొంత ఓటుబ్యాంకును చీల్చగలిగే పరిస్థితి కూడా ఉంది. మిగతా ప్రాంతీయ పార్టీల కంటే బీఎస్పీకి ఉన్న ఈ ప్రత్యేకతే ఇప్పుడు మాయావతిపై విపక్షాలు కన్నేయడానికి కారణమైంది.

యూపీని గెలవకుండా..!

ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ముందు ఉత్తర్‌ప్రదేశ్ గెలవాలి అన్నది భారత రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న నానుడి. మొత్తం 545 స్థానాలున్న లోక్‌సభలో నామినేటెడ్ సభ్యులిద్దరిని తీసేస్తే.. ఎన్నికలు జరగనున్న 543 స్థానాల్లో అత్యధికంగా 80 సీట్లు ఈ ఒక్క రాష్ట్రం నుంచే ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలతో సహా ఇక్కడ ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో వారిదే ప్రభుత్వం ఏర్పాటవుతూ వస్తోంది. దేశానికి అత్యధిక సంఖ్యలో ప్రధాన మంత్రులను సైతం అందించిన రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు ఒక రికార్డు ఉంది. అలాంటి రాష్ట్రంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తిరుగులేని బలీయమైన శక్తిగా మారింది. పైగా రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన ఊపులో ఉంది. ఈ స్థితిలో కమలనాథుల అశ్వమేధ యాగానికి బ్రేకులు వేయడానికి విపక్ష కూటమి (I.N.D.I.A)లోని సమాజ్‌వాదీ, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్(RLD)లు జట్టుగా నిలిచినప్పటికీ బీజేపీని ఎదుర్కోగలమన్న విశ్వాసాన్ని, భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. ఇందుక్కారణం ఇదే రాష్ట్రంలో గట్టి పట్టున్న బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఇప్పటి వరకు ఒంటరి పోరు చేస్తామని ప్రకటించడమే. దళిత, బహుజన వర్గాల్లో బలమైన ఓటుబ్యాంకును కల్గిన ఈ పార్టీ చీల్చే ఓట్లు తమకే ఎక్కువ నష్టం కల్గిస్తాయన్నది విపక్ష కూటమి నేతల భావన.

ఇవి కూడా చదవండి

మాయావతి ఏ గట్టున?

విపక్ష కూటమి (I.N.D.I.A) ఏర్పాటు సమయంలో బీఎస్పీని కలుపుకోవద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ షరతు విధించారన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పాట్నాలో జరిగిన తొలి సమావేశంలో మాయావతికి ఆహ్వానం పంపకపోవడం వెనుక కారణం ఇదేనని చెబుతుంటారు. అందుకే ఆ సమయంలో మాయావతి విపక్ష కూటమి (I.N.D.I.A)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “వేదికపై నేతల చేతులు కలుస్తాయి తప్ప వారి మనసులు కలవవు” అంటూ కూటమి ఐక్యతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఏక్లా చలో (ఒంటరి పోరు) అంటూ కార్యకర్తలు, నేతలను ఎన్నికల రణక్షేత్రానికి సిద్ధం చేస్తున్నారు. నిజానికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేశాయి. రాష్ట్రంలోని మొత్తం 80 నియోజకవర్గాల్లో బీఎస్పీ 38, ఎస్పీ 37, ఆర్ఎల్డీ 3 సీట్లలో పోటీ చేశాయి. బీఎస్పీ 10 గెలుచుకోగా, ఎస్పీకి 5 సీట్లు మాత్రమే దక్కాయి. ఆర్ఎల్డీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అప్పుడు విడిగా పోటీచేసిన కాంగ్రెస్ కేవలం సోనియా గాంధీ పోటీ చేసిన రాయ్‌బరేలి ఒక్కటే గెలుచుకుంది. గాంధీ కుటుంబ కంచుకోటగా చెప్పుకునే అమేఠీలో రాహుల్ గాంధీ సైతం ఓటమిపాలయ్యారు. ఎస్పీ-బీఎస్పీ చెలిమి ఈ ఎన్నిక వరకే పరిమితమైంది. విపక్ష కూటమి (I.N.D.I.A)లో బీఎస్పీని చేర్చకుండా అఖిలేశ్ అడ్డుకుంటూ ఆ రాష్ట్రంలో తన పట్టు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు.

ఓవరాల్‌గా ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A)లో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో సీట్ల పంపిణీ, సర్దుబాటును సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవే నిర్ణయిస్తారు. ఆ మేరకు కూటమి ఏర్పడినప్పుడే ఒప్పందాలు, అంగీకారాలు జరిగాయి. రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో 65 సీట్లకు తగ్గకుండా పోటీచేయాలని అఖిలేశ్ యాదవ్ భావిస్తున్నారు. మిగతా 15 సీట్లలో కాంగ్రెస్, ఆర్ఎల్డీలకు సర్దుబాటు చేయాలన్నది ఆయన ప్లాన్. ఒకవేళ బీఎస్పీ కూడా తమ కూటమిలో చేరితే.. ఎస్పీ పోటీ చేసే స్థానాల సంఖ్య సగానికి సగం తగ్గించుకోవాల్సి వస్తుంది. ఉన్న సమాచారం ప్రకారం మాయావతి ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే.. తాను 80 సీట్లలో 40 సీట్లకు తగ్గకుండా పోటీచేస్తానని చెప్పారట. అంతేకాదు, యూపీతో పాటు దేశవ్యాప్తంగా ఉనికి, ప్రబావం కలిగిన మాయావతికి అఖిలేశ్ కంటే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. అందుకే వ్యూహాత్మకంగా అఖిలేశ్ ఆమెకు ఎంట్రీ లేకుండా చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాయావతి సమాజ్‌వాదీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీని దళిత వ్యతిరేకి అంటూ ఏకిపారేశారు. ఒంటరిగానే ముందుకెళ్తానని ఆమె ప్రకటించారు.

కాంగ్రెస్ ప్లాన్-బీ

ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని మాయావతి ప్రకటించినా సరే.. కాంగ్రెస్ పార్టీలోని ముస్లిం నేతలు మాత్రం ఆమెతో పొత్తు కోసం ఆరాటపడుతున్నారు. పార్టీలోని సీనియర్ నేతలైన సల్మాన్ ఖుర్షీద్, ఇమ్రాన్ మసూద్ సహా పలువురు ముస్లిం నేతలు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకుగా ఉన్న దళిత, బహుజన వర్గాలు ఇప్పుడు మాయావతి వెంట ఉన్నాయి. ఆమెతో పొత్తు లేకుండా ఆ వర్గాల ఓట్లను కాంగ్రెస్ తనవైపు తిప్పుకోవడం సాధ్యం కాదని వారు సూచిస్తున్నారు. లక్నో నుంచి ఢిల్లీ వరకు జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో ఇలాంటి డిమాండ్లు, సూచనలే ఎక్కువగా వస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకత్వం సైతం ‘ప్లాన్-బీ’ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. అఖిలేశ్ యాదవ్ తాము కోరినన్ని సీట్లు కేటాయిస్తే సరి.. లేదంటే మాయావతిని కూటమిలో చేర్చుకుని దేశవ్యాప్తంగా ప్రయోజనం పొందడమే ఉత్తమమని అధిష్టానం అంచనా వేస్తోంది.

అందుకే యూపీలో సీట్ల పంపకం విషయంలో తొందరపడకుండా మాయావతి నుంచి వచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. తద్వారా సమాజ్‌వాదీ పార్టీని ఇరుకున పెట్టవచ్చని కూడా భావిస్తోంది. “యూపీలో సీట్లు కోరే స్థితిలో మేం లేం – సీట్లు ఇచ్చే స్థాయి మాది” అంటూ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం మనసు పొరల్లో పాతుకుపోయాయి. మొత్తంగా ఎస్పీ – బీఎస్పీ మధ్య నెలకొన్న వైరం ద్వారా కాంగ్రెస్ లబ్ది పొందాలని చూస్తోంది. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, విపక్ష కూటమిలోని మరికొన్ని భాగస్వామ్య పార్టీలు సైతం మాయావతితో పొత్తు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిసింది. తద్వారా తమ రాష్ట్రాల్లో దళిత, బహుజన ఓట్లను పొందవచ్చన్నది ఆ పార్టీల అంచనా. మాయావతి నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం కాంగ్రెస్‌తో పాటు విపక్ష కూటమిలోని మరికొన్ని పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఆమెను తమ గట్టుకు చేర్చుకుని ఎన్నికల్లో ఒడ్డెక్కాలని చూస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..