AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRICKS -2026: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ కానుక.. ఆ పుస్తకంలో ఏం ఉందంటే?

18వ బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచడంపై ప్రధాన చర్చ జరిగింది. రక్షణ, ఇంధన సహకారం, అణుశక్తి విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, ఉక్రెయిన్, పశ్చిమాసియా పరిణామాలపై నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇది భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

BRICKS -2026: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ కానుక.. ఆ పుస్తకంలో ఏం ఉందంటే?
Pm Modi Putin Meeting
Balaraju Goud
|

Updated on: Sep 11, 2026 | 4:42 PM

Share

న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ సిద్ధమైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ఈ కీలక అంతర్జాతీయ సదస్సుకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం శుక్రవారం (సెప్టెంబర్ 11) భారత్ మండపంలో ప్రారంభమైంది.

భారత్ మండపానికి చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోదీ.. పుతిన్‌కు ఒక పుస్తకాన్ని బహూకరించారు. ఆ తర్వాత ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలకు కూర్చున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తమిళ మహాకవి తిరువళ్లువర్ రచించిన ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని బహూకరించారు. ప్రాచీన తమిళ సాహిత్యంలోని గొప్ప గ్రంథంగా గుర్తింపు పొందిన తిరుక్కురళ్‌లో జీవితం, నైతికత, ప్రేమ, పాలన, సామాజిక విలువలకు సంబంధించిన సూత్రాలు ఉన్నాయి. ఈ బహుమతి భారత్-రష్యా సాంస్కృతిక బంధానికి ప్రతీకగా నిలిచింది.

2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం

ప్రధాని మోదీ-పుతిన్ భేటీలో భారత్, రష్యా మధ్య ఆర్థిక, వాణిజ్య, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యంపై ఇరువురు నేతలు దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం సుమారు 60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందని, దాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. చమురు, ఎరువులు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్ విడిభాగాలు, ఆహార ఉత్పత్తులు తదితర రంగాల్లో పరస్పర వాణిజ్యాన్ని పెంచే అవకాశాలపైనా చర్చలు జరగనున్నాయి. అలాగే రష్యాలో భారతీయ కంపెనీల పెట్టుబడులు, రష్యాలో భారత నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్య పెంపు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

రక్షణ రంగంలో కీలక చర్చలు

ప్రధాని మోదీ-పుతిన్ భేటీలో రక్షణ రంగం అత్యంత కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రష్యా తయారు చేసిన SU-57 ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదన చర్చల్లో ఉండనున్నట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. అయితే ఒప్పందం ఖరారైందని అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. భారత్–రష్యా ఇప్పటికే బ్రహ్మోస్ వంటి కీలక రక్షణ ప్రాజెక్టుల్లో కలిసి పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో రక్షణ ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం, సంయుక్త తయారీ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే అంశం కూడా ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది.

ఇంధనం, అణుశక్తి రంగాలపై ఫోకస్

ఇంధన రంగంలో భారత్‌కు రష్యా కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ముఖ్యంగా ముడి చమురు, ఎరువుల సరఫరాలో రష్యా ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంధన భద్రత, దీర్ఘకాలిక సరఫరాలు, అణుశక్తి సహకారం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. భారత్‌లో కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి రష్యాతో సహకారం పెంచే అంశం కూడా చర్చల అజెండాలో ఉన్నట్లు సమాచారం.

రైల్వేలు, మౌలిక వసతులపై చర్చ

భారత్–రష్యా ఆర్థిక సంబంధాలను చమురు, రక్షణ రంగాలకే పరిమితం చేయకుండా ఇతర రంగాల్లోకి విస్తరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రైల్వే రంగం, సొరంగాల నిర్మాణం, పారిశ్రామిక సహకారం, సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచే అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది. ఇటీవల జరిగిన భారత్–రష్యా ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్ సమావేశంలోనూ వాణిజ్యం, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని పెంచే అంశాలపై చర్చ జరిగింది.

ఉక్రెయిన్, పశ్చిమాసియా పరిణామాలపైనా చర్చ

ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా మోదీ–పుతిన్ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై వాటి ప్రభావం వంటి అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉంది. ఆగస్టు 31న బిష్కెక్‌లో జరిగిన మోదీ–పుతిన్ సమావేశంలోనూ పశ్చిమాసియా, బ్లాక్ సీ ప్రాంత పరిణామాలపై చర్చ జరిగింది. వివాదాల పరిష్కారానికి సంభాషణ, దౌత్యమే మార్గమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

పుతిన్ తర్వాత.. జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీ దౌత్యపరంగా అత్యంత బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉన్నారు. పుతిన్‌తో భేటీ తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తోనూ మోదీ సమావేశం కానున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా సెప్టెంబర్ 12న ఢిల్లీకి చేరుకోనున్నారు. జిన్‌పింగ్–మోదీ భేటీపై కూడా అంతర్జాతీయంగా భారీ ఆసక్తి నెలకొంది. వాణిజ్యం, సరిహద్దు అంశాలు, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. భారత్–చైనా మధ్య దాదాపు ఏడేళ్ల తర్వాత ఇలాంటి కీలక ద్వైపాక్షిక సమావేశం జరగనుండటంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

రెండు రోజుల పాటు బ్రిక్స్ సదస్సు

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ పాలన, బహుళపక్ష వ్యవస్థను బలోపేతం చేయడం, ఆహార-ఇంధన భద్రత, ఆరోగ్యం, విపత్తుల నిర్వహణ, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, కీలక సరఫరా గొలుసులు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. సెప్టెంబర్ 13న న్యూఢిల్లీ డిక్లరేషన్ విడుదలతో సదస్సు ముగియనుంది. ఇప్పటికే విస్తరించిన బ్రిక్స్ కూటమి ప్రపంచ జనాభా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్రను మరింత బలోపేతం చేసే వేదికగా మారనుంది.

మొత్తంగా చూస్తే.. మోదీ–పుతిన్ భేటీ భారత్–రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరో కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది. రక్షణ, ఇంధనం నుంచి వాణిజ్యం, అణుశక్తి, మౌలిక వసతులు, సాంకేతిక రంగాల వరకు సహకారాన్ని విస్తరించే దిశగా ఈ చర్చలు సాగనున్నాయి. అదే సమయంలో పుతిన్, జిన్‌పింగ్ సహా కీలక ప్రపంచ నేతలతో మోదీ వరుస భేటీలు జరగడం.. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us