ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ ఆధిపత్యం: జీ7పై పుతిన్ వ్యంగ్యాస్త్రాలు.. అమెరికా ఆంక్షలపై ఘాటు వ్యాఖ్యలు
ఢిల్లీలో బ్రిక్స్ వేదికగా పుతిన్ జీ7పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల వాటా 40% అని, వాటి ప్రాధాన్యత పెరుగుతోందని పుతిన్ అన్నారు. ప్రపంచం పరివర్తన దశలో ఉందని, అమెరికా ఆంక్షలు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. రష్యా ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం వ్యాపార దౌత్యాన్ని విస్తరిస్తుందని స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ సెషన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీ7 దేశాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యత వేగంగా పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం బ్రిక్స్ దేశాల్లోనే ఉందని, ఈ దేశాల మార్కెట్లు భారీగా ఉన్నాయని పుతిన్ అన్నారు. ‘‘వారు తమను తాము జీ7 అని ఎందుకు పిలుచుకుంటారో నాకు తెలియదు. మా వాటా 40 శాతం కాగా.. వారి వాటా తక్కువ’’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచ వాణిజ్యంలోనూ బ్రిక్స్ దేశాల పాత్ర గణనీయంగా పెరుగుతోందన్నారు.
ప్రపంచం పరివర్తన దశలో ఉందిః పుతిన్
ప్రపంచం ప్రస్తుతం వేగవంతమైన మార్పుల దశలో ఉందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కొత్త వృద్ధి కేంద్రాలు, భారీ పట్టణీకరణ, పెద్ద కంపెనీల ఆవిర్భావం వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చుతున్నాయని పేర్కొన్నారు. మానవాళి శ్రేయస్సు కోసం ఈ మార్పులకు అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
అమెరికా ఆంక్షలపై విమర్శలు
అమెరికా విధిస్తున్న ఆంక్షలు, ద్వితీయ ఆంక్షలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని పుతిన్ విమర్శించారు. ఆంక్షలకు గురైన కొన్ని దేశాల్లో పారిశ్రామిక రంగం, ఆర్థిక వ్యవస్థలు క్షీణిస్తున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ఆయా దేశాల గణాంకాల ఆధారంగానే చెబుతున్నానని పేర్కొన్నారు. రష్యా అణుశక్తి రంగం ప్రపంచంలోనే అతిపెద్దదని చెబుతూ.. అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ తీవ్రంగా ఉందన్నారు. రష్యా సంస్థలు కూడా ప్రపంచ పోటీలో నిలబడేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు.
‘‘మేము ఎవరికీ వ్యతిరేకం కాదు’’: పుతిన్
రష్యా ఏ దేశానికీ వ్యతిరేకంగా పనిచేయడం లేదని వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. తమ దేశ ప్రయోజనాల కోసం వ్యాపార దౌత్యాన్ని ఉపయోగిస్తూ ప్రపంచ దేశాలతో భాగస్వామ్యాలను పెంచుకోవడమే లక్ష్యమన్నారు. బ్రిక్స్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించే మంచి వేదికగా మారుతోందని, సభ్య దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలను మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని పుతిన్ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
