బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల వ్యూహకర్త-రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో గాంధీ విగ్రహం కింద ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష చేస్తున్న చిత్రాలలో, అతని వెనుక ఒక వ్యానిటీ వ్యాన్ నిలబడి ఉంది. ఈ వ్యానిటీ వ్యాన్ ధర కోటి రూపాయలు పలుకుతుండడంతో సామాన్యుల్లో ఉత్సుకతతో పాటు చర్చనీయాంశంగా మారింది.
జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కిషోర్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం కింద కూర్చొని గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. డిసెంబర్ 13న జరిగిన బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) పరీక్షలో పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో అనేక మంది విద్యార్థుల మద్దతుతో ఈ నిరసన చేపట్టారు. కిషోర్ నిరవధిక నిరాహారదీక్ష మధ్య, నిరసన ప్రదేశంలో అతని లగ్జరీ వ్యానిటీ వ్యాన్ పార్క్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి, దాని ఉనికి గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
గాంధీ విగ్రహం వెనుక పార్క్ చేసిన కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్‌లో 5 స్టార్ హోటల్‌లా అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో సౌకర్యవంతమైన బెడ్, సోఫా సెట్లు, బాత్‌రూమ్‌లు, వై-ఫై, హైటెక్ సౌకర్యాలు ఉన్నాయి. వ్యానిటీ వ్యాన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, విమర్శలు మొదలయ్యాయి. కొంతమంది దీనిని డాంబిక,అనవసరమైన ఆడంబరంగా భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఈ వ్యానిటీ వ్యాన్‌లో ఫ్రెష్‌అప్ అయ్యి, బట్టలు మార్చుకుని, మధ్యలో రెస్ట్ తీసుకుంటాడని, అర్థరాత్రి ఈ వ్యాన్‌లోనే పడుకుంటాడని విమర్శిస్తున్నారు అధికారపక్ష నేతలు.
మరోవైపు ప్రశాంత్ కిషోర్ పనులు, ఆరోగ్యం చూసుకునేందుకు ఈ వ్యానిటీ వ్యాన్ వినియోగిస్తున్నట్లు జన్ సూరజ్ అభియాన్ చెబుతోంది. వ్యానిటీ వ్యాన్ అంశాన్ని లేవనెత్తడం కేవలం దృష్టి మళ్లించే ప్రయత్నమని జన్ సూరజ్ పార్టీ అధికార ప్రతినిధి వివేక్ అన్నారు. ఈ ఉద్యమం రాష్ట్రంలోని యువత భవిష్యత్తు కోసమని, కొంతమంది ప్రశాంత్ కిషోర్ పరువు తీసేందుకు ఇలాంటి సమస్యలను లేవనెత్తుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యానిటీ వ్యాన్ ప్రచారానికి ఒక సాధనం మాత్రమే. అసలు విషయం బీహార్ గురించి యువత, నిరుద్యోగం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యావ్యవస్థను మెరుగుపరచాలని, యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుతూ ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఈ నిరాహార దీక్ష కొనసాగుతోంది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) ఇటీవలి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాట్నాతో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులు రైలు, రోడ్డు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. 70వ బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ గాంధీ మైదాన్‌లో నిరాహార దీక్ష చేస్తున్నారు.
అయితే అధికారులు ఇది చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. నిరాహార వేదికను మార్చమని అతనిని కోరింది. కానీ ప్రశాంత్ కిశోర్ అందుకు నిరాకరించారు. ‘ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విద్యార్థుల ఫిర్యాదులను వినాలని, విద్యార్థులు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే చేస్తాను’ అని కిషోర్ అన్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్‌కు పాట్నా డీఎం చంద్రశేఖర్ నోటీసు పంపారు. గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టవద్దని చెప్పారు. గాంధీ విగ్రహం దగ్గర నిరసనలు చేయడం నిషేధం. ఈ మేరకు నోటీసు ఇచ్చాం, కానీ స్పందన రాలేదని డీఎం తెలిపారు. ముందు పరీక్ష పూర్తయి, తర్వాత తదుపరి చర్యల గురించి ఆలోచిస్తాం. బహిరంగ ప్రదేశంలో ఎవరూ కూర్చుని ధర్నా చేయకూడదని డీఎం స్పష్టం చేశారు.
పాట్నాలోని 22 పరీక్షా కేంద్రాల్లో బీపీఎస్సీ రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు, బిపిఎస్‌సి పిటి పరీక్ష డిసెంబర్ 13, 2024 న నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో పాట్నాలోని బాపు పరీక్షా కాంప్లెక్స్‌లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీని తరువాత, ఈ సెంటర్ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాట్నాలో 22 పరీక్షల చొప్పున ఆదివారం(జనవరి 5) పరీక్షను మళ్లీ నిర్వహిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..