BJP vs Congress: తెలంగాణ రోల్‌ మోడల్‌..! కులగణనపై క్రెడిట్‌ వార్‌.. వేడెక్కిన రాజకీయం..

కులగణనపై క్రెడిట్‌ వార్‌ ఊపందుకుంది. ఓవైపు పాక్‌తో తీవ్ర ఉద్రిక్తతలు , మరోవైపు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కులగణన చేపడుతామని కీలక ప్రకటన చేసింది. ఇది అధికార , విపక్షాల మధ్య మాటల యుద్దాన్ని రాజేసింది. మోదీ నాయకత్వానికి ఇది నిదర్శనమని బీజేపీ అంటుంటే .. రాహుల్‌ పోరాటానికి ఫలితం దక్కిందని కాంగ్రెస్‌ నేతలంటున్నారు.

BJP vs Congress: తెలంగాణ రోల్‌ మోడల్‌..! కులగణనపై క్రెడిట్‌ వార్‌.. వేడెక్కిన రాజకీయం..
Pm Modi Rahul Gandhi

Updated on: May 01, 2025 | 9:11 AM

కేంద్రం విపక్షాలపై పొలిటికల్‌ అస్త్రాన్ని ప్రయోగించింది. పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తామని ప్రకటించింది. కులగణనపై అధికార , విపక్షాల మధ్య క్రెడిట్‌ వార్‌ మొదలయ్యింది. కాంగ్రెస్‌ గతంలో కులగణను తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌. కులగణన పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సర్వేలు మాత్రమే చేశాయన్నారు. కొన్ని రాష్ట్రాలు సొంతంగా కులగణన చేశాయని , పారదర్శకంగా కులగణన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కులగణన తప్పుల తడకగా ఉందన్నారు. 1931లోనే చివరిసారి కులగణన చేశారని అన్నారు అశ్విని వైష్ణవ్‌. జనాభా లెక్కల్లోనే కులగణన తేలుతుందన్నారు .

కులగణన విషయంలో.. తెలంగాణ దేశానికి రోల్‌ మోడల్‌

అయితే కులగణన ఏజెండాతో తాము పార్లమెంట్‌ లోపల , బయట చేసిన పోరాటానికి ఫలితం దక్కిందంటున్నారు రాహుల్‌గాంధీ. కులగణను సంపూర్ణ మద్దతు ఇస్తునట్టు తెలిపారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి రోల్‌ మోడల్‌ అన్నారు. తెలంగాణ కులగణనకు , బిహార్‌ కులగణనకు చాలా తేడా ఉందన్నారు. అందుకే తెలంగాణలో చేసినట్టే దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలన్నారు. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు

చారిత్మాత్మక నిర్ణయం

కులగణన మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్మాత్మక నిర్ణయమని బీజేపీ నేతలు ప్రకటించారు. కులగణన పేరుతో కాంగ్రెస్‌ రాజకీయం చేసిందన్నారు. సామాజిక న్యాయం కోసం , అణగారిన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు కులగణన చేస్తునట్టు స్పష్టం చేశారు. 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కులగణనను ఎందుకు చేయలేదని బీజేపీ నేతలు నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ కీలక వ్యాఖ్యలు..

కులగణన కోసం దశాభ్దాల పాటు తమ పార్టీ పోరాడిందని అన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌. 2001 లోనే కులగణన కోసం లలూ యాదవ్‌ డిమాండ్‌ చేశారని అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు పూర్తిగా సమర్ధించాయి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తమ కూటమికి అస్త్రంగా పనిచేస్తుందన్న భావనలో ఉన్నారు సీఎం నితీష్‌కుమార్‌ . గతంలో బిహార్‌ ప్రభుత్వం చేసిన కులగణనను సుప్రీంకోర్టు కొట్టేసింది.

అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి మోదీ కులగణన చేపట్టారని బీజేపీ నేతలు ప్రశంసిస్తుంటే, ఇదంతా రాహుల్‌ కృషి అని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..