‘దేవుళ్ళ మాదిరి రథయాత్రలు చేస్తున్నారు’, బీజేపీ నేతలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపాటు
బీజేపీ చేబట్టిన రథయాత్రలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్లు, విమర్శలు కురిపించారు. ఆ పార్టీ నాయకులు తాము దేవుళ్ళ మాదిరి రథయాత్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
బీజేపీ చేబట్టిన రథయాత్రలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్లు, విమర్శలు కురిపించారు. ఆ పార్టీ నాయకులు తాము దేవుళ్ళ మాదిరి రథయాత్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ‘ఈ రథయాత్రలన్నవి మతపరమైన ఫెస్టివల్ కు సంబంధించినవి.. మనమంతా ఇలాంటి మతపర వేడుకల్లో పాల్గొంటుంటాం.. ఉదాహరణకు జగన్నాథ, బలరామ, సుభద్రాదేవీల రథయాత్రలను మనం చూస్తున్నాం’ అని మమత పేర్కొన్నారు. కానీ వీళ్ళు (బీజేపీ నాయకులు) తమ సొంత రాజకీయ ప్రయోజనాలకోసం రథాలపై ఊరేగుతున్నారని ఆమె అన్నారు. బుధవారం రాయ్ గంజ్ లో జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న ఆమె.. తమకు డబ్బు ఉందని, ఏదైనా చేయవచ్ఛునని కమలం పార్టీ నాయకులు భావిస్తుంటారని, కానీ డబ్బు కన్నా మనిషి ఎక్కువని, అవసరాల కోసమే డబ్బు తప్ప దానికి మించి కాదని ఆమె చెప్పారు.
ఫోటోల కోసం బీజేపీ నేతలు స్థానికుల ఇళ్లలో భోజనాలు చేస్తుంటారని, కానీ ఆ ఫుడ్ ఫైవ్ స్టార్ హోటళ్లలో తెప్పించినదని మమత విమర్శించారు. లగ్జరీ వాహనాల్లో వఛ్చి ఇలా ఫోటో సెషన్లలో పాల్గొంటుంటారని ఆమె దుయ్యబట్టారు. గుజరాత్ నుంచి వచ్చిన వారు కాకుండా ఈ రాష్ట్రానికి చెందిన వారే ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని, ప్రజలను పాలించాలని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బెంగాల్ లో మరో మూడు, నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘పోరు’ ముదురుతోంది.