ఆ చట్టాలు రైతుల మేలు కోసమేనన్న ప్రధాని మోదీ.. కొత్త చట్టాలతో మద్దతు ధరపై కొనుగోళ్లు పెరిగాయని వెల్లడి
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ లోక్‌సభలో బదులిస్తూ వ్యవసాయ చట్టాలు ఆమోదం పొందిన అనంతరం..
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్, హర్యానా వంటి ఉత్తారాది రాష్ట్రాల రైతులు కేంద్ర ప్రభుత్వంపై యుద్ధమే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా సమర్ధించారు. లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. రైతుల బాగోగులు పట్టని కాంగ్రెస్ విభజిత రాజకీయాలను అనుసరిస్తోందని విమర్శించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ లోక్‌సభలో బదులిస్తూ వ్యవసాయ చట్టాలు ఆమోదం పొందిన అనంతరం మద్దతు ధరపై కొనుగోళ్లు పెరిగాయని అన్నారు. వ్యవసాయ చట్టాల ఉద్దేశాలు, లక్ష్యాలపై విపక్షాలు మాట్లాడాలని సూచించారు. వ్యవసాయ బిల్లులపై గొంతెత్తిన రైతుల వాదనలను సభతో పాటు ప్రభుత్వం గౌరవిస్తుందని, రైతులతో సీనియర్ మంత్రులు నిరంతరం మాట్లాడుతున్నారని చెప్పారు.
రైతుల ఆందోళనను ఆందోళనకారులు హైజాక్ చేసి టోల్ ప్లాజాలను పనిచేయనీయకుండా, టెలికాం టవర్లను ధ్వంసం చేస్తున్నారని, ఇవి పవిత్ర ఉద్యమానికి ఎలాంటి మేలు చేస్తాయని ప్రధాని ప్రశ్నించారు. 18వ శతాబ్ధం ఆలోచనలతో 20వ శతాబ్ధంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించలేమని అన్నారు. రైతులను పేదరికంలో చిక్కుకునేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. రైతులు ఏ ఒక్కరి మీదా ఆధారపడకుండా చేయడం మన బాధ్యతని చెప్పుకొచ్చారు. రైతుల సాధికారత దిశగా నూతన వ్యవసాయ చట్టాలు ఉపయోగపడతాయని అన్నారు.
Read more:
విశాఖ స్టీల్ ప్లాంట్ కొనేదెవరో చెప్పేసిన కేంద్ర మంత్రి.. 2019లోనే ఎంవోయూ కుదిరినట్లు వెల్లడి