విమాన ప్రమాదం తర్వాత ఈ ఇద్దరి ఆచూకీ లేదు! వీళ్లు విమానంలో కూడా లేరు.. కానీ..!

గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం కూలిపోయింది. 242 మందిలో 241 మంది మరణించగా, ఒక బ్రిటిష్-ఇండియన్ ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం కూలిన ప్రదేశంలోని హాస్టల్‌లో కొందరు విద్యార్థులు కూడా మృతి చెందారు.

విమాన ప్రమాదం తర్వాత ఈ ఇద్దరి ఆచూకీ లేదు! వీళ్లు విమానంలో కూడా లేరు.. కానీ..!
Sharlaben Thakor And Two Ye

Updated on: Jun 13, 2025 | 7:39 PM

230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లతో 242 మందితో కూడిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళుతున్న విమానం టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు మృతి చెందారు. బ్రిటిష్-ఇండియన్‌ ప్రయాణీకుడు విశ్వష్ కుమార్ రమేష్ మాత్రమే ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే విమానం కూలిన మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ బిల్డింగ్‌లో ఉన్న కొంతమంది మెడికల్‌ విద్యార్థులు కూడా మృత్యువాత పడ్డారు.

అలాగే ఓ వృద్ధురాలు, ఓ చిన్నారి కూడా విమాన ప్రమాదం తర్వాద ఆచూకీ లేకుండా పోయారు. ఆ వృద్ధురాలు.. వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లకు భోజనం వండే పనిచేస్తుంది. ఆమె రుచికరమైన భోజనం – వేడి చపాతీలు, కూరలు, గుజరాతీ వంటకాలు చేస్తుంటే.. ఆమె కుమారుడు వాటిని కళాశాల క్యాంపస్‌లో డెలివరీ చేసేవాడు. కానీ గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్‌లోకి ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో అంతా క్షణాల్లోనే ముగిసింది. ఆమె కుమారుడు ఇప్పుడు తన తల్లి, కుమార్తె మృతదేహాల కోసం వెతుకుతున్నాడు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో వారిద్దరూ కళాశాలలో కలిసి ఉన్నారు.

ఆమె పేరు షర్లాబెన్ ఠాకూర్. ఆమె బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్‌లో వంట మనిషిగా పనిచేస్తోంది. విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఠాకూర్, ఆమె రెండేళ్ల మనవరాలు హాస్టల్‌లో ఉన్నారు. ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత సివిల్ హాస్పిటల్ వైద్యులు ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యుల DNA నమూనాలను సేకరిస్తూ ఉండగా, శిథిలాల కింద మరిన్ని మృతదేహాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే షార్లాబెన్ ఠాకూర్, చిన్నారి అధ్యా ఆచూకీ కనిపించడం లేదు. ప్రమాద సమయంలో వాళ్లు హాస్టల్‌లోనే ఉండటంతో వారు కూడా మరణించి ఉంటారని అంతా భావిస్తున్నారు. వారి మృతదేహాల కోసం వెతుకుతున్నారు. కన్న తల్లి, చిన్నారి కూతుర్ని కోల్పోయిన రవి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..