Bihar Political Crisis: బీహార్‌లో రసవత్తర రాజకీయం.. నితీశ్ – తేజస్వి మధ్య కుదిరిన డీల్..?
బీహర్ రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీతో బంధాన్ని తెంచుకుని మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతున్నారు. పాట్నాలో జేడీయూ ఎమ్మెల్యేలతో నితీష్ కుమార్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో తేజస్వి యాదవ్
Bihar Political Crisis: బీహర్ రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీతో బంధాన్ని తెంచుకుని మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతున్నారు. పాట్నాలో జేడీయూ ఎమ్మెల్యేలతో నితీష్ కుమార్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో తేజస్వి యాదవ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. రెండు పార్టీలు కలిసి ఏర్పాటుచేసే ప్రభుత్వంలో 19 మంది సభ్యులున్న కాంగ్రెస్, 16 మంది సభ్యుల బలం ఉన్న వామపక్షాలు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లో బీహార్ గవర్నర్ పాగు చౌహన్ ను కలిసి తాము ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని నితీష్ కుమార్ కోరే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. మరోవైపు తేజస్వి యాదవ్ తో జరగుతున్న సమావేశానికి హాజరవుతున్న ఆపార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను లోపలకి అనుమతించడం లేదు. శాసనసభ్యులంతా ఫోన్లను గేటు బయటే తమ సిబ్బంది వద్ద ఉంచి వెళ్లారు. గతంలోనూ ఏళ్ల తరబడి బీజేపీ-జేడీయూ మిత్రపక్షంగా ఉండగా.. 2014 ఎన్నికలకు ముందు ఆపార్టీ కాంగ్రెస్, ఆర్జేడీతో జతకట్టింది. ఆతర్వాత నితీష్ కుమార్ కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి కటీప్ చెప్పి బీజేపీతో చేరారు. 2020 ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీచేశాయి. రెండేళ్లు గడవకముందే బీజేపీతో బంధానికి నితీష్ కుమార్ గుడ్ బై చెప్పబోతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జోరందుకుంది. ఇటీవల కాలంలో అగ్నిపథ్ పథకం, కుల గణన వంటి అంశాల్లో జేడీయూ, బీజేపీ మధ్య భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జేడీయూ ఎన్డీయే అభ్యర్థులకు మద్దతు ఇచ్చినా.. వీటికి సంబంధించిన పలు కార్యక్రమాలకు నితీశ్ కుమార్ గైర్హాజరయ్యారు. ఆదివారం నీతి ఆయోగ్ సమావేశానికి బిహార్ సీఎం నితీష్ కుమార్ హాజరుకాలేదు.
మరోవైపు నితీష్ నమ్మకద్రోహి అని..విశ్వాసం లేని వ్యక్తంటూ బీజేపీ ఆరోపిస్తోంది. నితీష్ కుమార్ తో వెళ్లొద్దని లాలూప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యులకు సూచిస్తోంది. అయినా ఇప్పటికే నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ మధ్య డీల్ కుదరడం, ఈఅంశాన్ని కాంగ్రెస్ అధినేత్రితోనూ బిహార్ సీఎం చర్చించడంతో బీజేపీ-జేడీయూ ప్రభుత్వం బిహార్ లో కూలిపోనుంది.
జేడీయూ-ఆర్జేడీ కూటమి కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే మంత్రివర్గం ఎలా ఉండాలనే దానిపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండనున్నారు .. తేజస్వి యాదవ్ హోంమంత్రి పదవి అడిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు మూడు మంత్రి పదవులు, వామపక్షాలకు మూడు మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా బీహార్ రాజకీయం ఏ మలుపు తిరగనుందో కొద్ది గంటల్లోనే తేలనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..