Bride Escape: అమ్మాయి బాగుందని, లేట్ చేస్తే బాగోదని వెంటనే పెళ్లికి ఓకే చెప్పేశాడు ఆ వ్యక్తి. ఇరువురి కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పడంతో.. పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కట్నం, బంగారం, బహుమతులు అన్నీ ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి తంతు ముగిసిన తరువాత అందరూ పెళ్లి కూతురును అత్తింటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అయితే, అప్పటి వరకు బుద్ధిగా ఉన్న వధువు.. మరుసటి రోజు ఉదయానికి తన అసలు బుద్ధిని ప్రదర్శించింది. తెల్లారి లేచి చూసే సరికి జంప్ అయ్యింది. మామూలుగా కాదు.. 4 లక్షల రూపాయల విలువైన నగలు, లక్షన్నర రూపాయల నగదు, వరుడికి కట్నంగా ఇచ్చిన బైక్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఉదయం లేచి చూడగా.. భార్య కనిపించకపోవడంతో బైక్, నగలు, డబ్బు కూడా మాయం అవడంతో వరుడు సహా అతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్‌లోని మోతిహారి జిల్లాలోని పక్డిదయాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనౌజీ పంచాయతీ హరనాథ్‌పూర్ పర్సౌని గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. హరనాథ గ్రామానికి చెందిన జోగి సాహ్ కుమారుడు ఆనంద్ కుమార్, ఢాకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సా నివాసి రామ్‌నాథ్ సాహ్ కుమార్తె మున్ని కుమారితో మే 9న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మే 10న ఆనంద్ నవ వధువుతో కలిసి తన ఇంటికి చేరుకున్నాడు. నూతన వధువుకు వరుడి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. వధువు రాక ఆనందంలో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. వధువుతో పాటు ఆమె సోదరుడు, సోదరుడి స్నేహితుడు కూడా వచ్చారు.
4 లక్షల నగలు, లక్షన్నర రూపాయలతో పరార్..
మే 11వ తేదీన ఉదయం వధువు ఇంట్లో లేకపోవడంతో వరుడు ఇల్లంతా వెతికి చూశాడు. వెంట వచ్చిన ఆమె సోదరుడు, సోదరుడి స్నేహితుడు కూడా కనిపించడం లేదు. దాంతో పాటు ఇంట్లో ఉంచిన రూ.4 లక్షల విలువైన నగలు, రూ.1.5 లక్షల నగదు కూడా మాయం అమయ్యాయి. అంతే కాదు కట్నంగా ఇచ్చిన కొత్త బైక్ కూడా కనిపించలేదు. కొద్ది గంటల క్రితం వరకు ఉన్న ఆనంద వాతావరణం.. పెళ్లి కూతురు చేసిన పనితో నీరుగారిపోయింది. అసలు ఏం జరిగిందో అర్థం కాక.. లబోదిబోమన్నారు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.