కుబేరుడి గాలి తగిలిందో ఏముందో.. రాత్రికి రాత్రి ప్లంబర్ అకౌంట్‌లో వందలాది కోట్లు..!

లక్షల్లో అప్పులున్నవాడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైతే ఎలా ఉంటుందో.. బీహార్‌కు చెందిన ఒక సాధారణ యువకుడి పరిస్థితి అలాగే మారింది. ఒక సాధారణ ప్లంబర్‌గా జీవనం సాగిస్తున్న ఆ యువకుడి బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా ఏకంగా రూ. 294 కోట్ల 80 లక్షలు ప్రత్యక్షమవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

కుబేరుడి గాలి తగిలిందో ఏముందో.. రాత్రికి రాత్రి ప్లంబర్ అకౌంట్‌లో వందలాది కోట్లు..!
Rs 294 Crore Credited To Young Man's Account

Updated on: Jun 05, 2026 | 5:28 PM

లక్షల్లో అప్పులున్నవాడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైతే ఎలా ఉంటుందో.. బీహార్‌కు చెందిన ఒక సాధారణ యువకుడి పరిస్థితి అలాగే మారింది. ఒక సాధారణ ప్లంబర్‌గా జీవనం సాగిస్తున్న ఆ యువకుడి బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా ఏకంగా రూ. 294 కోట్ల 80 లక్షలు ప్రత్యక్షమవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని గయా జిల్లా, బోధగయ బ్లాక్ పరిధిలోని మస్త్‌పురా గ్రామానికి చెందిన వికాస్ కుమార్ అనే యువకుడు ఐదేళ్లుగా ‘జియో పేమెంట్స్ బ్యాంక్’లో ఖాతాను నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతను తన మొబైల్‌లోని జియో ఫైనాన్స్ యాప్ ద్వారా అకౌంట్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకున్నాడు. స్క్రీన్‌పై కనిపించిన అంకెలను చూసి అతని కళ్లు బైర్లు కమ్మాయి. అందులో ఏకంగా రూ. 294.8 కోట్లు జమ అయినట్లు కనిపించాయి. మొదట్లో ఇదో సాంకేతిక సమస్య అనుకుని వికాస్ వదిలేశాడు. కానీ, మరుసటి రోజు మళ్లీ చెక్ చేసినా అదే భారీ మొత్తం కనిపించడంతో అతని గుండె ఆగినంత పనైంది.

సాధారణంగా వికాస్ అకౌంట్‌లో గతంలో కేవలం రూ. 6 లక్షల నుండి రూ. 7 లక్షల లోపే లావాదేవీలు జరిగాయి. అలాంటిది వందల కోట్లు అకౌంట్‌లోకి రావడంపై వికాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అయితే, ఎంతో తెలివిగా వ్యవహరించిన అతను.. ఆ అకౌంట్ నుండి ఎలాంటి డబ్బును విత్‌డ్రా చేయడానికి గానీ, ఇతర లావాదేవీలు చేయడానికి గానీ ప్రయత్నించలేదని స్పష్టం చేశాడు.

ఈ వార్త దావానంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలిరావడంతో వికాస్‌కు పరామర్శలు వెల్లువెత్తాయి. ఇదంతా బ్యాంకింగ్ వ్యవస్థ లేదా సాఫ్ట్‌వేర్ లోపం వల్లనే జరిగి ఉంటుందని కొందరు భావిస్తుండగా, దీని వెనుక ఏదైనా సైబర్ నేరగాళ్ల ‘మ్యూల్ అకౌంట్’ హస్తం ఉందా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వికాస్ ఈ విషయంపై విచారణ జరిపి తగిన స్పష్టత ఇవ్వాలని బ్యాంకు అధికారులను డిమాండ్ చేశాడు. బ్యాంకు యాజమాన్యం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us