బెంగుళూరులో జరిగిన ఘరానా మోసం ఒకటి సంచలనం రేపుతోంది. ఏకంగా ఓ మహిళా న్యాయవాదిని టార్గెట్‌గా బాధితురాలిని చేశారు. సైబర్ నేరగాళ్లు మహిళను డబ్బు మోసం చేయడమే కాకుండా కెమెరా ముందు ఆమెను బట్టలు విప్పమని బలవంతం చేశారు. 36 గంటల పాటు దుండగులు మహిళా న్యాయవాదిపై పలు రకాల వేధింపులకు పాల్పడినట్టుగా తెలిసింది. కస్టమ్స్ అధికారుల ముసుగులో మహిళ న్యాయవాదికి వీడియో కాల్ చేసిన మోసగాళ్లు మహిళను బట్టలు విప్పమని బలవంతం చేయడమే కాకుండా.. వీడియో రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేశారు. ఆ వీడియోతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఆమెను బెదిరించిన దుండగులు లక్షుల దోచుకున్నారు. ఎట్టకేలకు ఆలస్యంగా విషయం అర్థం చేసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఫెడెక్స్ ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీకి చెందిన వ్యక్తినని చెబుతూ బెంగళూరుకు చెందిన 29 ఏళ్ల యువతికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఏప్రిల్ 3న మహిళా లాయర్‌కు కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి తాను ముంబై పోలీస్‌గా నమ్మించాడు.. థాయిలాండ్ నుండి తన పేరు మీద 140 గ్రాముల డ్రగ్స్ ఉన్న పార్శిల్ వచ్చిందని చెప్పాడు. 5 పాస్‌పోర్టులు, 3 క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్పాడు. నార్కోటిక్స్ టెస్టు పేరిట వీడియో కాల్‌లో ఆమెతో అసభ్యంగా బట్టలు తొలగించాలని డిమాండ్ చేసి వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియోను బహిర్గతం చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టారు.
సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వకపోతే వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బెదిరిపోయిన సదరు మహిళ న్యాయవాది చేసేదేమీ లేక నిందితుల డిమాండ్‌కు తలొగ్గింది. వారు కోరినట్టు నగదును ఆన్‌లైన్‌లో వారు చెప్పిన అకౌంట్‌కు బదిలీ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 7న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..