Bengaluru Flooding: కర్ణాటకలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం భారీ వర్షాల కారణంగా బెంగళూరులో తీవ్ర వరదలు వచ్చాయి. దీంతో భారీ ఎత్తున నష్టం చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరులో వరదల కారణంగా జన జీవనం స్థంభించిపోయింది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ మాట్లాడుతూ.. గత వారం బెంగళూరులో భారీ వర్షం కారణంగా వరదలు తీవ్రంగా వచ్చాయని, భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. అక్రమ నిర్మాణానికి తొలగించడానికి ప్రభుత్వం నోయిడా ట్విన్ టవర్స్ లాగా కూల్చివేత డ్రైవ్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. వరదల కారణంగా బెంగళూరులో రోడ్లు, ఇళ్లు, కార్యాలయాలు ముంపునకు గురయ్యాయని, నగరంలో క్రమబద్ధీకరించని నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా నష్టం తీవ్రంగా ఉందని అన్నారు. అయితే సెప్టెంబర్ 13న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. నోయిడాలో ట్విన్ టవర్ కూల్చివేత మాదిరిగానే నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్‌టెక్ అక్రమంగా నిర్మించిన రెండు అపార్ట్‌మెంట్ టవర్‌లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 28న కూల్చివేశారు. ఇలా నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవనాలకు బిల్డర్లు బాధ్యతల వహించాలని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
నగరంలో 690కి పైగా ఆక్రమణలు ఉన్నాయని, ఎఇసిఎస్ లేఅవుట్ వద్ద ఇప్పటికే మూడు భవనాలను కూల్చివేశామని, మురుగునీటి కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించామని బృహత్ బెంగళూరు మహానగర పాలికె చీఫ్ ఇంజనీర్ లోకేష్ తెలిపారు. చల్లఘట్ట, మహదేవ్‌పురా, యలహంకలో కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోందని లోకేష్ వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి