ఢాకా, జులై 23: బంగ్లాదేశ్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులో బోళ్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ గౌతమ్ కుమార్ ఘోష్ తెలిపారు. 35 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు.
ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళ్తున్న ఈ బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పి చెరువులో పడిపోయింది. బస్సులో 65 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు కొందరు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను బస్సులో ఎక్కించుకోవడం కూడా ప్రమాదానికి మరో కారణంగా చెప్పుకొచ్చారు. చెరువులో నుంచి బస్సును వెలికితీసేందుకు పోలీసులు క్రేన్లను ఉపయోగిస్తున్నారు. క్షతగాత్రులను ఝలకతి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.