Heavy Rain Alert: అతి భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ! రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవ్‌..

ఉత్తరాదితోపాటు దక్షిణాదిలోనూ వానలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రను కూడా భారీ వర్షం ముంచెత్తింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దాటికి అక్కడి పలు జిల్లాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా ముంబైలోని భారీ వర్షాల దాటికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో..

Heavy Rain Alert: అతి భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ! రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవ్‌..
Rain Red Alert

Updated on: Aug 18, 2025 | 5:18 PM

దేశ వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదితోపాటు దక్షిణాదిలోనూ వానలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రను కూడా భారీ వర్షం ముంచెత్తింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దాటికి అక్కడి పలు జిల్లాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా ముంబైలోని భారీ వర్షాల దాటికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జన జీవనం స్తంభించిపోయింది. సోమవారం మధ్యాహ్నం నుంచి అన్ని పాఠశాలలు, కాలేజీలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సెలవు ఇచ్చింది. మంగళవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు రాబోయే రెండు రోజులు ముంబై, థానే, రాయ్‌గడ్, రత్నగిరి, సతారా, కొల్హాపూర్‌, పూణె సహా పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ముంబై పోలీసులు ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబై వీధులన్నీ జలదిగ్భందంలో నిలిచిపోయాయి. ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు MMRలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 21 నాటికి మరిన్ని హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న అధిక వర్షపాతం ప్రభావాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రాలయ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు తెలిపారు. నీట మునిగిన ప్రాంతాల్లో పంపులతో నీటిని తొలగించి, సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో 100, 112, 103 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.