
మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి.. అడ్డంగా బుక్కై..!
దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యోదంతం తరహాలో దిగ్భ్రాంతికర ఘటనలు ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఢిల్లీలోనే నిక్కీ యాదవ్ అనే యువతిని సాహిల్ గహ్లోత్ అనే యువకుడు చంపేసి దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టిన ఘటన మరిచిపోకముందే మరో ఉదంతం వెలుగుచూసింది. ఓ మహిళ పరాయి పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను దారుణంగా చంపేసింది. అంతటితో ఆగకుండా ముక్కలుగా నరికి శరీర భాగాల్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి కొండల్లో విసిరేసింది. అస్సాంలోని గువాహటిలో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గువాహటి సమీపంలోని నున్‌మతిలో వందన కలీట, భర్త అమరేంద్ర డే, అత్త శంకరి డేలతో నివాసం ఉంటోంది. ఐతే పరాయి పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వందన కలీట ఏడు నెలల క్రితమే ప్రియుడితో కలిసి భర్త, అత్తలను హత్య చేసింది. అనంతరం వారి శరీర భాగాలను ముక్కలుగా నరికి పాలిథీన్ కవర్లలో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. కొన్ని రోజుల తర్వాత వాటిని గువాహటికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే మేఘాలయలోని చిరపుంజికి తన ప్రియుడితో కలిసి వెళ్లి అక్కడి కొండల్లో శరీర భాగాలను విసిరేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ స్టేషన్‌లో భర్త, అత్త కనిపించడం లేదంటూ గతేడాది సెప్టెంబర్‌లో మిస్సింగ్ కేసు పెట్టింది. ఈ ఘటన గతేడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో జరగింది. ఐతే అమరేంద్ర డే తల్లికి సంబంధించిన కొన్ని శరీర భాగాలను పోలీసులు మేఘాలయాలో స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
కొన్ని రోజుల తర్వాత అమరేంద్ర కజిన్ సైతం మిస్సింగ్ కంప్లయింట్ ఇవ్వడంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. నూన్‌మతి పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు కావడంతో వందనను అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. వందన కలీట.. ఆమె ప్రియుడు, మరో వ్యక్తి సహాయంతో తల్లీకొడుకులను హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. నిందితులు మేఘాలయాలోని చిరపుంజిలో విసిరేసిన శరీర భాగాల కోసం గాలించగా ఆదివారం కొన్ని శరీర భాగాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.